ఈ భార్య కాకుంటే మరో భార్య - దత్తపత్రుడు ఇలా : చంద్రబాబు అలా - సీఎం జగన్ ఫైర్..!!
కడప గడ్డ నుంచి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు- జనసేనాని పవన్ ను టార్గెట్ చేసారు. చంద్రబాబు ఈ పార్టీ కాకుంటే మరో పార్టీ.. ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం అన్నట్లుగా ఉన్నారని..ఆయనతో కలిసి ఉన్న దత్తపుత్రుడులా ఈ భార్య కాకుంటే మరో భార్య అనటం లేదన్నారు. తనది ఒకే రాష్ట్రం..ఒకటే విధానమని స్పష్టం చేసారు. ఇక్కడే మమకారం.. ఇక్కడే రాజకీయంం..ఇక్కడి 5 కోట్ల మందే తన కుటుంబమని సీఎం జగన్ స్పష్టం చేసారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా కమలాపురంలో జరిగిన సభలో సీఎం కీలక ప్రసంగం చేసారు.

చంద్రబాబు - పవన్ లక్ష్యంగా
ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనలో మరోసారి పవన్ కల్యాణ్- భార్యల ఎపిసోడ్ తెర మీదకు తెచ్చారు. చంద్రబాబు పైన విమర్శలు మొదలు పెట్టిన సీఎం జగన్ ఆయన లాగా తాను ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం వెళ్లనని స్పష్టం చేసారు. కమలాపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు నీటిని తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. ఎక్కడో ఉన్న కృష్ణా జలాలను కడపకు తీసుకు వచ్చిన ఘనత వైఎస్ఆర్ దేనని వివరించారు. ఆగిన సాగునీటి ప్రాజెక్టులు కొనసాగిస్తున్నామని చెప్పారు. చిత్రావతి లో 10 టి ఎమ్ సిలు, గండి కోట -బ్రహం సాగర్ కు 500 కోట్ల వ్యయంతో లైనింగ్ పనులు పూర్తి చేసి నీరు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

టీడీపీ పాలనపై ఫైర్
వైఎస్సార్ జిల్లాను గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇప్పుడు ఆగిన పనులు జరుగుతున్నా యంటే మీ బిడ్డ ముఖ్య మంత్రి కావడమే కారణమని చెప్పుకొచ్చారు. కమలాపురం లో రూ 1017 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసామని వెల్లడించారు. వివక్ష లేకుండా అర్హులైన పేదలందరికీ పథకాలు అందించామన్నారు. ఎక్కడా దళారులు లేరని.. లబ్దిదారులు ఎవరైనా నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు వస్తుందని..ఇదంతా మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే సాధ్యమైందని వివరించారు. గత ప్రభుత్వం దోచుకో, దాచుకో, పంచుకో విధానం అమలు చేసిందని ఫైర్ అయ్యారు. గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ అని వివరించిన ముఖ్యమంత్రి గత పాలకులు ఈ సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోయారో ఆలోచించాలని సూచించారు.

జనవరి నెలాఖరులో స్టీల్ ప్లాంట్ పనులు
జనవరి నెలాఖరులో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయని సీఎం వెల్లడించారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ 8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ కొత్త సంవత్సరం కానుకగా స్టీల్ ఫ్యాక్టరీ అందించ బోతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పైన హామీ ఇచ్చారని గుర్తు చేసారు. విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. రాజకీయ నాయకుడికి విశ్వసనీయ ఉండాలని చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగా.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పర్యటన ఈ రోజు ప్రారంభమైంది. క్రిస్మస్ వేడుకల తరువాత సీఎం పర్యటన ముగియనుంది.












Click it and Unblock the Notifications