ప్రత్యేక హోదా - మూడు రాజధానులు : అమిత్ షా ముందు జగన్ డిమాండ్ : అజెండా ఇదే..!!
సుదీర్ఘ కాలం తరువాత తిరుపతి కేంద్రంగా 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మధ్నాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశంలో ఆరుకు పైగా అంశాలను ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రత్యేక హోదా పైన సమావేశంలో ప్రస్తావన
అందులో ప్రధానంగా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని మరో సారి డిమాండ్ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో పాటుగా మూడు రాజధానుల అంశాన్ని హోం మంత్రికి వివరించాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో కేంద్రం విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి నిధుల విషయం పైన ప్రస్తావించనున్నారు.
అమరావతికి అప్పట్లో కేంద్రం 1500 కోట్ల రూపాయాలు ఇచ్చిందని... మరో వెయ్యి కోట్లు రాజధాని నిర్మాణానికి విడుదల చేయాలని సీఎం కోరనున్నారు. రాష్ట్రానికి మేలు చేకూరేలా ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

పొరుగు రాష్ట్రాల అంశాల పైనా చర్చ
వీటితో పాటుగా.. తెలుగు గంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు..కేంద్రం వద్ద తాత్సారం జరుగుతున్న అంశాన్ని సీఎం వివరించన్నారు. తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిల పైనా సీఎం చర్చించాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించనున్నారు. రేషన్ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపుల పైన జగన్ ప్రశ్నించాల ని నిర్ణయించారు.

తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు
తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్‌లైస్ బకాయిల అంశాల గురించి అడగనున్నారు. ఎఫ్‌డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాల ను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడం పైనా..అదే విధంగా నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావన. రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాల పైన సీఎం జగన్ ఈ సమావేశంలోనే సుదీర్ఘం వివరించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాల కు సీఎం జగన్ స్పష్టత ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

కేసీఆర్ - స్టాలిన్ గైర్హాజరు
ఈ సమావేశంలో తమిళనాడు.. తెలంగాణ మఖ్యమంత్రులు హాజరు కావటం లేదు. వారి తరపున ఆ రాష్ట్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ సీఎం జగన్ రొటేషన్ పద్దతిలో భాగంగా ఈ సారి సమావేశానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. తిరుపతిలో హటల్ తాజ్ లో మధ్నాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఈ సమావేశం జరగనుంది. ఆ తరువాత అతిధులకు సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు. ఈ రాత్రికే సీఎం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాత్రికి సైతం తిరుపతిలోనే బస చేసి సోమవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారైంది.












Click it and Unblock the Notifications