సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - బంగారంపై తక్కువ వడ్డీకే రుణాలు..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రైతులు, మహిళల స్థితిగతులు బావుంటాయని, సహకార రంగం కూడా అప్పుడే లాభాల బాట నడుస్తుందని అన్నారు. బంగారం తాకట్లుపై ప్రాధమిక సహకార పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే మహిళలు, రైతులకు రుణాలు ఇవ్వాలని సూచించారు.
రైతులు..మహిళలకు తక్కవ వడ్డీకే:సహకార సంఘాల కంప్యూటరీకరణను నవంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి డిసిసిబిలతోపాటు, సహకార మార్కెటింగ్ నెట్ వర్క్‌ను కూడా పటిష్టపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పిఎసిఎస్‌లు) నష్టాల్లో ఎందుకు ఉన్నాయన్న అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కూడా లాభాల బాటలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రైతులు, మహిళల స్థితిగతులు బావుంటాయని, సహకార రంగం కూడా అప్పుడే లాభాల బాట నడుస్తుందని అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రైతులు..మహిళలకు రుణాలు అందించాలని సీఎం జగన్ సూచించారు.

ఆర్బీకేలకు ప్రాంతీయ కార్యాలయాలుగా:ఆర్‌బికెల రూపంలో ప్రతి గ్రామంలోనూ అప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల శాఖలు ఉన్నట్లేనని తెలిపారు. మరే ఇతర బ్యాంకులకు లేని సదుపాయం వీటికి ఉందని పేర్కొన్నారు. ఆప్కాబ్‌లోనూ గతంలో చూడని పురోగతి కనిపిస్తోందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇప్పటికే రుణాలకు సంబంధించిన దరఖాస్తులను ఆర్‌బికెల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తు న్నాయని చెప్పారు. అలాగే డిసిఎంఎస్ పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో, పిఎసిఎస్‌ల్లో ప్రొఫెషనలిజం పెంచాలని నిర్దేశించారు. నవంబర్ నాటికి అన్నిచోట్ల కంప్యూటరీకరణ చేయాలని తెలిపారు. బంగారంపై రుణం భరోసా ఉన్న రుణ ప్రక్రియ అని, దీనివల్ల నష్టం ఉండదని అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పెరిగిన ఆర్దిక కార్యకలాపాలు:సహకారశాఖ సమీక్షలో బ్యాంకులకు సంబంధించిన పలు అంశాలను అధికారులకు సిఎంకు తెలిపారు. 2019తో పోలిస్తే 2023 నాటికి పిఎసిఎస్ ఆర్థిక కార్యకలాపాలు 84.32 శాతం పెరిగాయని తెలిపారు. 2019 వరకూ ఆర్థిక కార్యకలాపాలు రూ.11,884 కోట్లు కాగా, 2023 నాటికి రూ.21,906 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 400 పిఎసిఎస్‌లు నష్టాల నుంచి బయటకు వచ్చాయని వివరించారు. ఆప్కాబ్‌లో 2019లో రూ.13,322 కోట్లు లావాదేవీలు ఉండగా 2023 మార్చి నాటికి రూ.36,732 కోట్లకు పెరిగాయని వివరించారు. ఈ నాలుగేళ్లలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల విలువ రూ.14,440 కోట్లని, 175 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. నిరర్థక ఆస్తులు 50 శాతానికి పైగా తగ్గాయని చెప్పారు.












Click it and Unblock the Notifications