రేపు మహిళల ఖాతాల్లో జగన్ నిధుల జమ - వరుసగా మూడు పథకాల అమలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తనకు అధికారం అప్పగిస్తాయనే ధీమాతో ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నారు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్ తాను ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు (శుక్రవారం) జగనన్న విద్యా దీవెన నిధులు..ఆ తరువాత వరుసగా మూడు పథకాల అమలుకు నిర్ణయించారు.
భీమవరంకు సీఎం జగన్: ఏపీలో మహిళల ఖాతాల్లో పథకాలు నిధులు వరుసగా జమ కానున్నాయి. ఈ నెల 29న భీమవరం వేదికగా ముఖ్యమంత్రి విద్యా దీవెన నిధుల విడుదల చేయనున్నారు. ఇందుకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. గత నెలలోనే ఈ కార్యక్రమం పైన ఆలోచన చేసినా తుఫాను కారణంగా వాయిదా పడింది.

జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.
జగనన్న విద్యా దీవెన నిధులు: తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జగన్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 29న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు భీమవరంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయంగానూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో భీమవరం కేంద్రంగా జరిగే సభలో జగన్ ప్రసంగం పైనా ఆసక్తి కనిపిస్తోంది.
వరుసగా పథకాల అమలు: వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న జగన్ ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారుతోంది. ఇక జనవరి నెలలో మహిళల ఖాతాల్లో వరుసగా పథకాల నిధులు జమ అయ్యేలా కార్యాచరణ సిద్దం అయింది. జనవరి 1నుంచి ఏపీలో పెన్షన్ రూ 3వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి నెలలోనే చేయూత, ఆసరా పథకాల నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాల అమలు పైన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. జనవరి నెలలో ఈ పథకాలు..నిధుల విడుదల పండుగల నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం వేళ..సీఎం జగన్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications