లోటస్ పాండ్ కు సీఎం జగన్ - మంత్రి ఇంట్లో వేడుక : నేడు హైదరాబాద్ లో ఇలా..!!
ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన బిజీగా సాగనుంది. సీఎం జగన్ ఈ రోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హౌటెక్స్ చేరుకుంటారు. సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు సైతం హాజరవుతున్నారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లోనే బొత్సా కుమారుడి వివాహ నిశ్చితార్దం జరిగింది.

లోటస్ పాండ్ కు సీఎం జగన్
ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కేవీపీ..శైలజానాద్ తో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు..మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. వివాహ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారైంది. సుదీర్ఘ కాలం తరువాత సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా.. వైసీపీ అధినేతగా జగన్ అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నిర్వహించారు.
2019 ఎన్నికల సమయం నుంచి తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి నుంచే క్యాంపు కార్యాలయంగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం అయిన తరువాత ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. సీఎం జగన్ లోటస్ పాండ్ కు వెళ్లలేదు. ఇక, తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల..లోటస్ పాండ్ కేంద్రంగానే తన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

షర్మిల పార్టీ అక్కడి నుంచే
జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినా..తెలంగాణలో షర్మిల రాజకీయంగా ముందుకే వెళ్తున్నారు. అక్కడ నుంచి బేగంపేట్ విమానాశ్రయం చేరుకొని ఈ మధ్నాహ్నాం సీఎం తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. ఇక, ఈ నెల 16వ తేదీన సీఎం జగన్ తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంతో పాటుగా పలు డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
సీఎం అయిన తరువాత జగన్ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో రెండు రాష్ట్రాల అంశాల పైన చర్చల సమయంలో లోటస్ పాండ్ కు వచ్చారు. ఆ తరువాత పలు సందర్భాల్లో హైదరాబాద్ కు వచ్చినా..లోటస్ పాండ్ కు మాత్రం తక్కువగా వచ్చేవారు.

కొత్త వ్యూహాలతో సీఎం ముందుకు
కరోనా కారణంగా జిల్లాల పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉన్న సీఎం జగన్..ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టటంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత రచ్చబండ ప్రారంభించే ఆలోచన లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మూడు రాజధానులు.. మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.
ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. అదే సమయంలో కొత్త జిల్లాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణతో పాటుగా.. ప్రజలతో మమేకం అయ్యే విధంగా సీఎం జిల్లాల పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత మరింత వేగంగా పాలనలో నిర్ణయాలు ఉంటాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications