సీఎం జగన్ వ్యక్తిగతంగా లేఖలు : అది టీడీపీ విధానం- ఇది నా పోరాటం : ఖర్చు రూ.45 వేల కోట్లు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా లేఖలు రాసారు. దాదాపు 61 లక్షల మందికి వ్యక్తిగతంగా లేఖలు రాసారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంవత్సర శుభ దినాన పింఛన్లను నెలకు మరో రూ.250 పెంచుతూ రూ.2,500 చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. వలంటీర్లు 1వ తేదీన పింఛన్ డబ్బులతో పాటు ఆయా లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందించనున్నారు. అందులో సీఎం జగన్ .. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షులు అని చెబుతూ..ఒక శుభవార్త అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నానట్లుగా పేర్కొన్నారు.

జనవరి నుంచి పెరిగిన పెన్షన్ పంపిణీ
తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను స్వయంగా గమనించానని... 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్‌గా మీకిచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్లారా చూశానంటూ పేర్కొన్నారు.
ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థలో వృద్ధులు, దివ్యాంగులు రోజుల తరబడి చేంతాడంత కూలైన్లలో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నానని వివరించారు. గత పాలకులు దిగిపోయే ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య దాదాపు 61 లక్షలుగా పేర్కొన్నారు.

పెన్షన్ల కోసం నెలకు రూ 1,450 కోట్లు
గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు రూ.400 కోట్లు అయితే నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు రూ.1,450 కోట్లు. ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు రూ.18,000 కోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది.
ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్‌తో ఈ ఖర్చు ఈ యేడు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుందని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రూ 45 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేయగా.. 'పెన్షన్లను క్రమంగా రూ.3 వేల వరకు పెంచుతాం' అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు పెంచిన పెన్షన్ రూ.2,500 అందుతుందని సీఎం హామీ ఇచ్చారు.

కష్టాలు వచ్చిన మాట కోసం పోరాటం
పెన్షన్ అందుకోవడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ, వార్డు వలంటీర్ లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించండంటూ సీఎం తన లేఖలో సూచించారు. కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మీ కష్టాలు తెలుసు కాబట్టి ఠంచన్‌గా పింఛన్ అందే విధంగా చూసుకుంటున్నానంటూ లేఖలో వివరించారు.
పెన్షన్లు ఎలా తగ్గించాలనేది గత పాలకుల విధానం అయితే అర్హులు ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరంగా ఉండకూడదన్నది తన పోరాటంగా పేర్కొన్నారు. పారదర్శక విధానంలో కులం, మతం, ప్రాంతం ఆఖరుకు ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లంచాలు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెబుతున్నట్లుగా ముఖ్యమంత్రి రాసిన లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications