టీడీపీ సిట్టింగ్ సీటుపై సీఎం జగన్ గురి - వైసీపీ అభ్యర్ధి ఫిక్స్..!!
ముఖ్యమంత్రి జగన్ టీడీపీకి కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాలపైన గురి పెట్టారు. టీడీపీ సిట్టింగ్ సీట్లలో తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యేలే తిరిగి పోటీ చేస్తారని ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితుల పైన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే బలమైన సంకేతాలతో మరింత జాగ్రత్తగా అభ్యర్ధుల ఎంపిక చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
దీంతో..తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పైన సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారు. అక్కడ టీడీపీ వరుసగా 2009 ఎన్నికల నుంచి విజయం సాధిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి ఓడిపోయారు. బోసుకు 67, 429 ఓట్లు రాగా, జోగేశ్వర రావుకు 78,029 ఓట్లు వచ్చాయి. జనసేన మూడో స్థానంలో ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్, ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులు పైన ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ విజయం సాధించారు. దీంతో, వైసీపీ లో చేరిన సమయంలోనే సీఎం జగన్ ఆయనకు మండపేట బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ చేసారు. వచ్చే ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా తోట త్రిమూర్తులు దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలని ఇప్పటికే త్రిమూర్తులకు సీఎం జగన్ నిర్దేశించారు.
నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు ఇప్పటికే గడపగడపకు తిరుగుతున్నారు. దీంతో, ఈ రోజు జరిగే సమీక్షలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల ద్వారా జరిగిన లబ్ది వివరాలను సీఎం వెల్లడించనున్నారు. కాపు సామాజిక వర్గంలో గోదావరి జిల్లాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తోట త్రిమూర్తుు మండపేట అభ్యర్ధి గా బరిలో ఉంటారని అనుచరులు చెబుతున్నారు. దీంతో, నేడు సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications