
వైసీపీ ఎమ్మెల్యేల్లో రేసులో నిలిచేదెవరు : డేంజర్ బెల్స్ - నేడే ఫైనల్..!!
CM Jagan Decisions: ఏపీలో ఎన్నికలకు సీఎం జగన్ ముందస్తుగా సిద్దం అవుతున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలను ఆరు నెలల క్రితం నుంచే ప్రజల వద్దకు పంపారు. క్షేత్ర స్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పలు మార్గాల్లో సమాచారం సేకరిస్తున్నారు. 151 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో తిరిగి టికెట్లు దక్కేదెవరికి..అవకాశం కోల్పోతోందెవరనేది స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించారు.
పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచేదెవరో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అంచనాలు అందుకోని వారికి ఫైనల్ ఛాన్స్ ఇస్తారా..లేదా అనేది ఉత్కంఠగా మారుతోంది. దీంతో, ఈ సమావేశం కీలకంగా మారుతోంది.

పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం..
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జయహో బీసీ నిర్వహణ..ఆ సభలో చేసిన దిశా నిర్దేశంతో వచ్చే ఎన్నికల విషయంలో సీఎం ఎంత సీరియస్ గా ఉన్నారో స్పష్టం అవుతోంది. ఇప్పుడు పార్టీ రీజనల్ ఇంఛార్జ్ లు..జిల్లా అధ్యక్షులతో పాటుగా తాజాగా నియమితులైన నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో సీఎం సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం - పార్టీ సమన్వయం గురించి సీఎం వివరించనున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య భేదాభిప్రాయాలు..వర్గ పోరు వంటి విషయంలో ఇక సీఎం కఠిన నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేయనున్నారు. ఇందు కోసం నియోజకవర్గాల వారీగా పార్టీ - ప్రభుత్వ వ్యవహారాల పై తాజాగా నియమితులైన కో ఆర్డినేటర్లు పార్టీ రాష్ట్ర శాఖకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపేలా..కొత్త ఫార్మాట్ సిద్దం చేసారు.

ఎమ్మెల్యేల పని తీరు - సర్వే నివేదికలు
ఈ మూడున్నారేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పని తీరు..నియోజవకర్గాల్లో గెలుపు అవకాశాల పైన సీఎం జగన్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు. సీఎం జగన్ పాలన పైన సానుకూలత కనిపిస్తున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన సానుకూలత లేని అంశాలు సర్వేల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో, ఎమ్మెల్యేలు ప్రతీ ఇంటికి వెళ్లటం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేలా ఆరు నెలలుగా గడప గడపకు ప్రభుత్వ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలోనూ కొందరు ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారు. వారికి ఇప్పటికే సీఎం స్పష్టమైన హెచ్చరిక చేసారు. పని తీరు మెరుగు పర్చుకోకుంటే టికెట్లు ఇవ్వలేనని తేల్చి చెప్పారు. వారికి ఈ నెల వరకు అందుకు సమయం ఇచ్చారు. కానీ, కొందరి పని తీరులో అంచనాలకు తగిన విధంగా మార్పు రాలేదని సమాచారం.
ఇప్పుడు నియోజకవర్గ కో ఆర్డి నేటర్లతో జిల్లా అధ్యక్షులు .. వారితో ప్రాంతీయ సమన్వయకర్తలు నిత్యం టచ్ లో ఉంటూ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణమాలు.. బూత్ లెవల్ నుంచి ఆరా తీసి అవసరమైన చోట సమిష్టి నిర్ణయాలతో సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ - కీలక నిర్ణయాల దిశగా
ముఖ్యమంత్రి ఇప్పటికే ఎమ్మెల్యేలు..నేతలకంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పారు. ఎవరికైనా టికెట్ రాలేదంటే వారి సమర్ధత - పని తీరే కారణమని స్పష్టం చేసారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావటం ముఖ్యమని క్లియర్ గా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దాదాపుగా 36 మంది ఎమ్మెల్యేల పని తీరు సీఎం జగన్ అంచనాల కంటే తక్కువగా ఉందని పార్టీ ముఖ్యనేతల చర్చల్లో వినిపిస్తోంది.
వారి విషయంలో సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో..వారికి ఫైనల్ హెచ్చరిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో.. నియోజకవర్గాల వారీగా ప్రతీ ఒక్కరూ ప్రజలతో ఉండాలని సీఎం స్పష్టం చేస్తున్నారు. బూత్ లెవల్ లో పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వార్డు వాలంటీర్ తరహాలోనే ఈ కమిటీ నుంచి ఒకరు ప్రతీ 50 ఇళ్లకు ప్రతినిధిగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా ఈ సమావేశం ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దాదాపుగా తన తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో వెల్లడించే అవకాశం ఉంది. దీంతో, ఈ సమావేశం పైన పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.