జగన్ మున్సిపల్ రివ్యూ-కీలక నిర్ణయాలు- ఎయిర్ పోర్ట్ లకు వెళ్లే రోడ్లపై ఆదేశాలు
ఏపీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలతో పాటు ఇతర అంశాలపై సీఎం జగన్ సీఎం సమీక్షించారు.
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై ఇవాళ జరిగిన రివ్యూలో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో 16762 రోడ్లకు సంబంధించి 4396.65 కి.మీ మేర రోడ్లు వేసేందుకు రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయని, వీటితో పాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 15 జులై కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలన్నారు. నగరం అందాలను మెరుగుపరిచేలా ఉంచాలని, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.

అలాగే మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ పెట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని'' సీఎం సూచించారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక కోరారు.
పంట కాల్వల్లో చెత్త , ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణాల్లో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications