సీఎం జగన్ అలర్ట్ కావాల్సిందేనా - హుజూరాబాద్ మేలు కొలుపు : అక్కడే లింకు -అటు చంద్రబాబు రెడీ...!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఏపీలో జరిగిన బద్వేలులో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పోటీలో టీడీపీ..జనసేన దూరంగా ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తిరుపతి లోక్ సభ.. స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలు..ఇప్పుడు బద్వేలు..ఇలా అన్నింటా వైసీపీ విజయం సాధిస్తూనే ఉంది. అదే విధంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి..నంద్యాల..నందిగామలో విజయం సాధించింది.

ఒక్క ఎన్నిక..ఎన్నో అంశాలు
నాటి నంద్యాల పోరు..నేటి తెలంగాణలోని హుజూరాబాద్ పోరు దాదాపుగా ఒకే రకమైన రాజకీయ ఉత్కంఠకు కారణమయ్యాయి. అధికార పార్టీకి ఉండే అన్ని అవకాశాలు అప్పుడు..ఇప్పుడు సద్వినియోగం చేసుకున్నారు. ఇంత కంటే పోల్ మేనేజ్ మెంట్ చేయటానికి వీళ్లేదనే విధంగా అన్నీ చేసారు. కానీ, అక్కడ బీజేపీ గెలిచింది. కాదు..ఈటల రాజేందర్ గెలిచారు. సాంకేతికంగా బీజేపీ అభ్యర్ధి గెలిచినా..వ్యక్తిగా రాజేందర్ గెలుపొందారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడున్నారేళ్ల కాలంలో దుబ్బాక..గ్రేటర్ హైదరాబాద్..హుజూరాబాద్ మినహా అన్నింటా టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది.

టీఆర్ఎస్ కే కాదు..జగన్ కు సైతం
ముందస్తు ఎన్నికలకు వెళ్లినా..తిరిగి గులాబీ పార్టీయే అధికారం దక్కించుకుంది. టీఆర్ఎస్ బలం కంటే ప్రతిపక్షాల బలహీనత తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు హుజూరాబాద్ లో దళితబందు పేరుతో పది లక్షలు ఇచ్చిన గ్రామంలోనూ రాజేందర్ కు పట్టం కట్టారు. తాము అమలు చేస్తున్న పధకాలు..నేతల చేరికలతో ఖచ్చితంగా హుజూరాబాద్ లో గెలుస్తామని టీఆర్ఎస్ అతి విశ్వాసంతో కనిపించింది. అయితే, ఇప్పుడు హుజూరాబాద్ లో ఫలితం ఏపీతో లింకు పెట్టిన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఏటా వేల కోట్ల రూపాయాల మేర సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.

సంక్షేమ పథకాల పైనే భారం
అనేక పధకాల పేరుతో నేరుగా నగదు బదిలీ చేస్తోంది. లబ్ది దారుల్లో ఆర్దికంగా అందుతున్న తోడ్పాటు పైన సంతోషం కనిపిస్తోంది. కానీ, అందరికీ అందుతున్నాయా అనేది ఒక ప్రశ్న. ఇదే సమయంలో ఉద్యోగ నియామకాలు జరగటం లేదు. ప్రత్యేక హోదా పైన కనీసం కేంద్రాన్ని నిలదీసిన సందర్భం కనిపించటం లేదు. నవరత్నాలు.. మేని ఫెస్టోలో హామీలు అమలు చేసినా...ఊరూరా తిరిగి ప్రత్యేక హోదా కోసం సభలు పెట్టిన జగన్..ఇప్పుడు ఎక్కడా గట్టిగా డిమాండ్ చేయటం లేదనే అభిప్రాయం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కాలేదు. అభివృద్ధి కి కొత్త నిర్వచనాలు చెబుతున్నారు.

అభివృద్ధి ఎక్కడ...పంపకాల పైన అభ్యంతరాలు
కానీ, ఎక్కడా అభివృద్ధి మాత్రం చెప్పుకొనే అవకాశం ఇప్పటి వరకు లభించలేదు. ఇక, మూడు రాజధానుల పేరుతో డైలమా కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల పైన కేసుల విషయంలోనూ ప్రతికూల చర్చ నడుస్తోంది. కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బట్టటం పాలనకు మైనస్ అవుతోంది. అయితే, ప్రతీ ఇంటికి ప్రత్యక్షంగా..పరోక్షంగా అందిస్తున్న సంక్షేమం పేరుతో ఇస్తున్న ఆర్దిక తోడ్పాటు తిరిగి తమను గెలిపిస్తుందనేదే వైసీపీ నేతల ధీమా. అయితే, చంద్రబాబు సైతం 2019 ఎన్నికల ముందు సంక్షేమ పధకాలు అమలు చేసారు.

పధకాలతో ఓట్లు రాలుతాయా
ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు పది వేలు చొప్పున ఇచ్చారు. అలా ప్రయోజనం పొందిన వారు సైతం చంద్రబాబుకు ఓట్లు వేయలేదు. మరింత ప్రయోజనం చేస్తాననే జగన్ మాటలనే విశ్వసించారు. ఇప్పుడు జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు ఇస్తున్న దాని కంటే ఎక్కువ లబ్ది చేకూరుస్తామని చెప్పక తప్పని పరిస్థితి. అటు చంద్రబాబు అభివృద్ధి పేరుతో మధ్య తరగతి...విద్యార్ధులు..పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనకూలంగా మలచుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో పాటుగా వైసీపీలో కొన్ని ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల తీరు పైన వ్యతిరేకత కనిపిస్తోంది.

సీఎం జగన్ అలర్ట్ కావాల్సిందేనా
సీఎం జగన్ ఎక్కడా ఎమ్మెల్యేకు అప్పాయింట్ మెంట్లు ఇవ్వటం లేదు. వచ్చే రెండేళ్ల కాలంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. కానీ, సంక్షేమ పధకాలతో మాత్రమే ఓట్లు రావనేది ఏపీలో గతంలో జరిగిన ఎన్నికలు..ఇప్పుడు హుజూరాబాద్ బై పోల్ స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. దీనిని అధిగమిస్తూ.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలు మాత్రమే కాకుండా.. ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications