శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సీఎం జగన్ ఆగ్రహం.. పలువురు మంత్రులకు పిలుపు!!
ఏపీలో అధికార వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగన్ రానున్న ఎన్నికలకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్లు నిరాకరించటంతో ఎమ్మెల్యేలు బాహాటంగా తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను అసలు ఏం పని చేయనిచ్చారని సర్వేలో పనితీరుకు మార్కులు వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు సీఎం జగన్ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు .
గత రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు మాత్రమే ఎందుకు అన్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు . ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరింది.

రెండు రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ లో లైవ్ చేసిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యవహార శైలిపై హై కమాండ్ సీరియస్ అయింది. ఈ క్రమంలో ఆమెకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో కలిసి ఆపై ఆమె సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై, జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కాలువల నుంచి తమ ప్రాంతానికి తాగునీటి విడుదల కోసం కూడా సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక ప్రస్తుతం సీఎంను కలవనున్న జొన్నలగడ్డ పద్మావతి తాను చేసిన వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు. .మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు జగన్ తనను కలవటానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్‌తో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications