బలమైన ఓట్ బ్యాంక్ పై జగన్ బ్రహ్మాస్త్రం - 2024లో డిసైడింగ్ ఫ్యాక్టర్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతీ అడుగు పక్కా లెక్క ప్రకారం వేస్తున్నారు. ఓట్ బ్యాంక్ ఎక్కడా పక్కకు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొమ్మది నెలలు మీరు కష్టపడండి..అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ ఒక్క కేబినెట్ సమావేశంతో మొత్తం సీన్ మార్చేసారు. మరి కొన్ని నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
జగన్ లెక్క పక్కా : 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన ప్రాంతీయ - సామాజిక సమీకరణాలు పక్కగా వర్కవుట్ అయ్యాయి. ఫలితంగా టీడీపీని ఊహించని విధంగా 23 సీట్లకు పరిమితం చేసి..వైసీపీకి 151 సీట్లు దక్కాయి. తిరిగి వచ్చే ఎన్నికలు ఇటు సీఎం జగన్..అటు టీడీపీ అధినేత చంద్రబాబు కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

నవ్ ఆర్ నెవర్ అని చంద్రబాబు ఇప్పటికే కేడర్ కు తేల్చి చెప్పారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. దీని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలే తనకు తిరిగి అధికారాన్ని నిలబెడతాయనే ధీమాతో ఉన్నారు. పథకాల లబ్దిదారులను మరింత పెరిగేలా సంక్షేమ చక్ర పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి డోర్ డోర్ టు సర్వే ప్రారంభం కానుంది.
అనుకూలంగా మలచుకుంటూ : 2019 ఎన్నికల్లో మెజార్టీ ఉద్యోగులు జగన్ కు మద్దతుగా నిలిచారు. సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. కానీ, ఉద్యోగుల పీఆర్సీ.. నిధుల విడుదల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. ప్రభుత్వం తో కొన్ని ఉద్యోగ సంఘాలు విభేదించాయి. పీఆర్సీ పైన అనేక తర్జన భర్జనల తరువాత ఏకాభిప్రాయానికి వచ్చారు.
హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు చేసేందుకు ఉన్న ఇబ్బందులను వివరిస్తూనే జీపీఎస్ ను ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ నియమాకంపైన నిర్ణయం తీసుకుంది. కొత్త పీఆర్సీ నివేదిక ఆలస్యం అయితే ఎన్నికల ముందే మరోసారి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించాయి.

ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి : ఎన్నికల ఏడాదిలో ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తెచ్చి..తిరిగి వారిని తమ వైపు తిప్పుకోవటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో మహిళా ఓట్ బ్యాంకు సుస్థిరం చేసుకొనే పనులు వేగవంతం చేసారు. ఇప్పటికే అన్ని పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నారు. 30 లక్షల ఇళ్లు అందించటం ద్వారా ఓట్ బ్యాంకు పక్కకు పోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ నెల 28న అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో 15 వేలు చొప్పున జమ చేయనున్నారు. గ్రూప్ 1, గ్రూపు 2 ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరం అయింది. చంద్రబాబు చెబుతున్నవి..అధికారంలో ఉన్న తాను చేసి చూపించానని చెబుతూ టీడీపీ మేనిఫెస్టో వైపు చూడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఓట్ బ్యాంక్ ను సుస్థిరం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఓట్ బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. ఈ సమీకరణాలే సీఎం జగన్ గెలుపు ధీమాకు కారణంగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications