నెల్లూరు కు సీఎం జగన్ - మిత్రుడి కోసం : ఎప్పటికీ నిలిచేలా..!!
ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తున్నారు. రేపు (మంగళవారం) నెల్లూరు పర్యటనలో భాగంగా ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. జగన్ తొలి కేబినెట్ లో పరిశ్రమల శాఖతో పాటుగా అయిదు శాఖలకు మంత్రిగా పని చేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు.
ఆయన అంత్యక్రియలు..సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి మేకపాటి గౌతమ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్న నాటి నుంచి గౌతమ్ మిత్రుడు అని.. తన కోసం ఎంతగానో తపించేవారని చెబుతూ..గౌతమ్ కారణంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డి తనతో కలిసి ప్రయాణం చేసారని చెప్పారు. గౌతమ్ సంస్మరణలో భాగంగా ఆత్మకూరులోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీని.. వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ప్రభుత్వానికి అప్పగిచేందుకు మేకపాటి ముందుకొచ్చారు.

ఇక, అసెంబ్లీలో మేకపాటి గౌతమ్ సంతాప తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటనలు చేసారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ పేరును మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ గా ప్రకటించారు. దీని ద్వారా గౌతమ్ పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.
ఇక, గౌతమ్ స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక, గౌతమ్ పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు నెల్లూరు పర్యటనలో భాగంగా.. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేకపాటి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications