ఎన్నికల వేళ సీఎం జగన్ మరో కీలక హామీ అమలు - కలిసొచ్చేనా..!!
ఏపీలో ఎన్నికల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరింది. ఈ నెల 27వ తేదీ నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు నిర్ణయించారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్న జగన్ సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ఇచ్చిన మరో హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మరో ప్రధాన పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసారు.
సీఎం జగన్ నిర్ణయం:ఎన్నికల ముందు సీఎం జగన్ కీలకమైన రెండు సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 23న ఆసరా నాలుగో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఉరవకొండ నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మూడు విడతలుగా ఇప్పటి వరకు రూ 19,195 కోట్లు పంపిణీ చేసారు. చివరి విడతగా నాలుగో విడత కింద రూ 6,400 కోట్లు విడుదల కానుంది. దీని ద్వారా 78.94 లక్షల మందికి లబ్ది చేకూరనుంది, ఈ నెల 23వ తేదీ నుచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

ఆసరా నిధులు :నాలుగో విడత నిధుల విడుదల ద్వారా ఆసరా పథకం కింద మొత్తంగా రూ 25,570 కోట్లు మహిళలకు అందించినట్లవుతుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో మరో పథకం అమలుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు విడుదల చేసారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంతోనే పెన్షన్ రూ 3 వేలకు పెంపు అమలు ప్రారంభించారు.
వరుస పథకాలతో:ఇక, ఎన్నికల ముందు దాదాపు కోటి పది లక్షల మంది మహిళలకు లబ్ది జరగనుంది. తమ పార్టీ అభ్యర్దులను ఖరారు చేసి..వారిని ఈ పథకాల అమల్లో భాగస్వాములను చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి సీఎం జగన్ ఈ పథకం ప్రారంభం సమయంలో చేసే ప్రసంగం పైనా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు అమలు చేస్తున్న ఈ పథకాల ద్వారా రాజకీయంగా ఏ మేర ప్రయోజనం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications