రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభం - ఇ–స్టాంపింగ్ ప్రారంభం..!!
ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం కానున్నాయి. ఇప్పటికే సచివాలయాల ద్వారానూ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజా రిజిస్ట్రేషన్ శాఖలో ఇ-స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. దీని ద్వారా ఇక నుంచి ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించే ఇ-స్టాంపింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఆవిష్కరించారు.
రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆవిష్కరించిన ఇ-స్టాంపింగ్ విధానం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. సాంకేతికతను వినియోగిస్తూ ఈ సేవలను సామన్యులకు దగ్గర చేసేలా ప్రభుత్వం ఈ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిదిగా స్పష్టం చేస్తున్నారు. www.shcilestamp.com వెబ్‌సైట్‌లో మరియు ఇ-స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఇ-స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చని వెల్లడించారు.

దీంతో పాటుగా.. నగదు,చెక్కు,ఆన్‌లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చని చెప్పుకొచ్చారు. ఎస్‌బీఐ,ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.
త్వరలో మరో వెయ్యి కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ-స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చని చెప్పారు. స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమంగా అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications