చంద్రబాబుకు టైమ్స్ అరుదైన అవార్డు..! క్రెడిట్ ఎవరికిచ్చారంటే ?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న వ్యాపార సంస్కరణలకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఆయన్ను "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్"గా ఎంపిక చేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రప్పించడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, ఆ మేరకు గూగుల్ వంటి సంస్దలు పెట్టుబడులు పెడుతున్న తీరు, ఇలా పలు అంశాలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది.
ఇవాళ కలెక్టర్ల సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. దీంతో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబుకు కుర్చీల్లో నుంచి లేచి నిలబడి స్టాండింగ్ ఓవెషన్ కూడా తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. మంత్రులు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.

అనంతరం తనకు లభించిన అవార్డుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదన్నారు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానన్నారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచిందని, ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు.

ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. 18నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేసామన్నారు.పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదన్నారు. ద్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా ఆని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని,రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications