ఏపీలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్- నిర్మాణ పనులను ప్రారంభించిన వైఎస్ జగన్
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దీని నిర్మాణ పనులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు. తొలి దశలో 5,156 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే ఎరువులు, బొగ్గు, వంటనూనెలు, కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, గ్రానైట్, ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి ఈ పోర్ట్ ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆరు ఓడరేవులు మాత్రమే నిర్మితం అయ్యాయి.

వైఎస్ జగన్ ప్రభుత్వం తన హయాంలో గత నాలుగేళ్లలో హయాంలోనే నాలుగు కొత్త ఓడరేవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. రామాయపట్నం, కాకినాడ సెజ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూలాపేట పోర్టు నిర్మాణ పనులకు వైఎస్ జగన్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మచిలీపట్నం ఓడరేవు పనులకు శ్రీకారం చుట్టారు.
దీని వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు. ఎగుమతి-దిగుమతుల కార్యకలాపాల కోసం నాలుగు బెర్త్‌లను నిర్మిస్తారు. క్రమంగా వాటి సంఖ్యను 10కి పెంచుతారు. ప్రతి సంవత్సరం 115 మిలియన్ టన్నుల నిర్వహణ సామర్థ్యంతో ఈ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. 24 నుంచి 30 నెలల వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని జగన్ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనివల్ల 25 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

మచిలీపట్నం పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్ట్ నిర్మాణానికి ఫిబ్రవరి 28వ తేదీన పర్యావరణ అనుమతులు లభించాయి. కార్గో రవాణా కోసం 216 జాతీయ రహదారిని కలుపుతూ ఆరున్నర కిలోమీటర్ల పొడవు గల నాలుగు లేన్ల హైవే, పెడన రైల్వే స్టేషన్ నుండి పోర్ట్ వరకు ఏడున్నర కిలోమీటర్ల మేర రైలు మార్గం అందుబాటులోకి రానుంది.
పోర్ట్ నిర్మాణ పనుల సందర్భంగా వైఎస్ జగన్.. సముద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటకం, పరిశ్రలమ శాఖ మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణ పనులను వైఎస్ జగన్ స్వయంగా పర్యవేక్షించారు. అక్కడే ఏర్పాటు చేసిన మచిలీపట్నం పోర్ట్ నమూనాను పరిశీలించారు. అనంతరం బహిరంగ సభ వేదికకు తరలివెళ్లారు.












Click it and Unblock the Notifications