ఎన్నికల వేళ.. జగన్ గుడ్ న్యూస్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాల కింద నిధులను విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్ నొక్కి- ఆయా నిధులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు.
వరుసగా అయిదో సంవత్సరం, ఈ ఏడాది మూడో విడతగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఒక్కొక్కరికి 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,078.36 కోట్ల రూపాయలను జమ చేశారు. వరుసగా నాలుగో ఏడాది సున్నా వడ్డీ పంట రుణాల కింద 10,78,615 మంది రైతులకు 215.98 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ సొమ్మును విడుదల చేశారు.

తన దూకుడు మరింత పెంచారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ఎంతో సమయం లేకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల కింద నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోన్న జగన్.. నిరాటంకంగా వాటిని కొనసాగించనున్నారు.
లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందించడానికి ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. దీనికోసం మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పామర్రులో జరిగే బహిరంగ సభలో విద్యా దీవెన పథకం కింద బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు.
మార్చి 1వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి పామర్రుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద బటన్ నొక్కి నగదు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. మధ్యాహ్నానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులను చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్.. వంటి కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరిస్తోంది ఈ పథకం కింద.
ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకం కింద నిధులను లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఐటీఐ-10,000, పాలిటెక్నిక్-15,000, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చేసే వారికి 20,000 రూపాయల చొప్పున నగదును బదిలీ చేస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇప్పటివరకు 18,576 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications