పుట్టినరోజు నాడు వైఎస్ జగన్ కీలక నిర్ణయం- వారితో.. వారి కోసం..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. 50వ పడిలో అడుగు పెట్టనున్నారు. దేశంలోనే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా గుర్తింపు పొందారాయన. తాను నెలకొల్పిన పార్టీని కూడా అదే స్థాయిలో నిలిపారు. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ.. వైఎస్ఆర్సీపీ. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తరువాత అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నది వైసీపీకే.

బర్త్‌డే విషెస్..
వైఎస్ జగన్.. 50వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలు పెట్టారు కూడా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది. ఆయనకు విషెస్ చెబుతూ వేర్వేరు హ్యాష్ ట్యాగ్స్‌తో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. అదే స్థాయిలో వీడియోలు రీట్వీట్లు అవుతున్నాయి.

హ్యాష్ ట్యాగ్స్..
పార్టీ పెట్టినప్పటి నుంచీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకు.. సంక్షేమ పథకాల అమలు మొదలుకుని పోలవరం వంటి భారీ ప్రాజెక్టులకు నిర్మాణం వరకు- వాటన్నింటికీ సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడయా గ్రూపుల్లో దుమ్ము రేపుతున్నాయి. #AdvanceHBDJagananna, #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉంది. పుట్టినరోజు నాడు అన్ని జిల్లాల్లోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు పార్టీ నాయకులు.

బాపట్లలో..
కాగా తన పుట్టినరోజును పురస్కరించుకుని వైఎస్ జగన్ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల యడ్లపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించనున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్ధులకు ట్యాబ్లను పంపిణీ చేస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ట్యాబ్స్ పంపిణీకి..
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ట్యాబ్స్‌ను పంపిణీ చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 8వ తరగతి చదివే విద్యార్థులకు దశలవారీగా ఈ ట్యాబ్స్ అందజేస్తామంటూ ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అవసరమైన ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. జగన్ బర్త్‌డే నాడు వాటి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. 27వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా
రాష్ట్రవ్యాప్తంగా 4,59,564 మంది విద్యార్థులకు దశలవారీగా ట్యాబ్స్ అందనున్నాయి. వారితోపాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా వాటిని అందజేయనుంది విద్యా మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులు దీనికి అర్హులుగా గుర్తించింది. దీనికోసం ప్రభుత్వం 666 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేసిన ట్యాబ్స్‌ను విద్యార్థులందరికీ పంపిణీ చేయనుంది.












Click it and Unblock the Notifications