షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ అధికారం నిలబెట్టుకోవటం కోసం పోరాటం చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్, వామపక్ష కూటమి రంగంలోకి దిగుతోంది. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే చంద్రబాబు, పవన్ లక్ష్యానికి ఈ కూటమి సమస్యగా మారుతోంది.
రెండు కూటములు పోరు
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అటు చంద్రబాబు వరుస సభల్లో పాల్గొంటున్నారు. హోరా హోరీ ప్రచారం కొనసాగుతోంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే తాము జత కట్టామని చంద్రబాబు, పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసామని ప్రచారం చేస్తున్నారు.

ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమికి పోటీగా ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాల కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. సీట్ల సర్దుబాటు పైన వామపక్ష నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ కానున్నారు. వైసీపీలో సీట్లు రాని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి సీట్ల పైన హామీ దక్కింది.
బరిలో రెండో కూటమి అభ్యర్దులు
ఇప్పటికే జరిగిన చర్చల్లో వామపక్ష నేతలు తాము కోరుతున్న స్థానాల పైన షర్మిలకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్దంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు రావటంతో పోటీ చేసే అభ్యర్దుల ఖరారు పైన కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.
ఇటు వామపక్షాలు కురుపాం, అరకు లోయ, రంపచోడవరం, గాజువాక, గన్నవరం, విజయవాడ సెంట్రల్, మంగళగిరి, నెల్లూరు, కర్నూలు, సంతనూతలపాడు వంటి స్థానాలను ఖాయంగా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ఈ స్థానాల్లో వామపక్ష అభ్యర్దులు బరిలో ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్దుల పైన ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది.
ఎవరికి కలిసొచ్చేను
రెండు వామపక్ష పార్టీలు రెండు చొప్పున ఎంపీ స్థానాలు 10-15 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నాయి. వామపక్ష నేతలు కోరుతున్న స్థానాల పైన ఎన్డీఏ కూటమి అభ్యర్దులు ఆశలు పెట్టుకున్నారు. అక్కడ హోరా హోరీగా పోరు మారుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్దులు బరిలో ఉంటూ దక్కించుకొనే ఓట్లు కీలకం కానున్నాయి.
ఈ ఓటింగ్ ఎవరి పైన ప్రభావం చూపుతాయనే అంశం పైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి మేలు చేస్తుందనే వాదన ఒక వైపు వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ కు పడాల్సిన ఓటే కాంగ్రెస్ కు పోలవుతుందనేది మరో విశ్లేషణ. దీంతో..కాంగ్రెస్ కూటమి పొందే సీట్లు ఏ స్థాయిలో ఉంటాయి. ఎవరి గెలుపు ఓటమలును మార్చుతాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications