కేసీఆర్‌పై వ్యాఖ్య: రేవంత్‌రెడ్డిపై నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన నాంపల్లి పోలీసు స్టేషన్‌లో తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి ఫిర్యాదు చేసింది. గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొనకపోవడాన్ని రాజకీయం చేస్తూ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ పైన కేసు నమోదు చేయాలని వారు శనివారం నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం నేతలు విలేకరులతో మాట్లాడారు. తాము రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు పైన న్యాయ సలహా తీసుకొని కేసును నమోదు చేస్తామని పోలీసులు తెలిపారని వారు అన్నారు.

సీఎం జిల్లాకు నిధులు
మెదక్ జిల్లాలోని కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. గజ్వేల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీస్ రెంట్, వాహనాల లీజుకు రూ.33.34 లక్షలు మంజూరు చేసింది.
కవిత పరామర్శ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద బాధితులను నిజామాబాద్ ఎంపీ కవిత పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు నివేదిక తయారుచేసి, వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications