ఆమంచి వర్సెస్ కరణం వర్గాలుగా : మద్దతు కౌన్సిలర్ల బాహాబాహీ - ఇద్దరిపై సస్పెన్షన్ వేటు..!!
చీరాల వైసీపీలో వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు చీరాల మున్సిపల్ సమావేశంలోనూ వైసీపీ కౌన్సిలర్లు ఇద్దరి మద్దతు దారులుగా.. రెండు వర్గాలుగా విడిపోయి బాహా బాహీకి దిగారు. దీంతో..మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది.
ఆమంచి వర్గం కౌన్సిలర్లు పార్టీ గుర్తుపై గెలవలేదంటూ.. తామే వైసీపీ తరపున గెలిచామని కరణం వర్గం కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఆమంచి వర్గం కౌన్సిలర్లు చైర్మన్ పోడియం దగ్గర బైఠాయించారు. ఆమంచి వర్గ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి మీరు టిడిపికు ఓట్లు వేసి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ

మంచి వర్గ కౌన్సిలర్లు చైర్మన్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, కౌన్సిల్ సభ్యులను దూషించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్ పోడియం ముందు కరణం వర్గ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే చైర్మన్, సభ పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ.. ఆమంచి వర్గం కౌన్సిలర్లు సత్యనందం, సురేష్‌పై చైర్మన్ శ్రీనివాసరావు 6 నెలల పాటు సస్పెండ్ వేటు చేశారు. గతంలోనే ఇదే రకమైన వివాదంతో కౌన్సిల్ సమావేశం లో గందరగోళం చోటు చేసుకుంది.
రెండు వర్గాలు ఒకే పార్టీలో కొనసాగుతున్నా..సమన్వయం లేకపోవటమే ఈ పరిస్థితికి కారణంగా స్థానిక నేతలు చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం సైతం వీరి మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ప్రస్తుతం అక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉండటంతో..అక్కడ నేతల మధ్య సయోధ్యకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications