చంద్రబాబు, పవన్ ఆశలపై షర్మిల నీళ్లు - కీలక మలుపు..!!
ఏపీలో మరో రాజకీయ కూటమి ఖరారైంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల కూటమి ఎన్డీగా పోటీకి దిగనుంది. ఇటు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏపీలో పోటీ చేయనున్నారు. వీరితో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలవనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కూటమి ఏర్పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే చంద్రబాబు, పవన్ లక్ష్యానికి నష్టం చేయనుంది. మరి, వైసీపీకి ప్రయోజనం ఉంటుందా.
కీలక నిర్ణయాలు : ఏపీలో ఎన్నికల సమయంలో ఆసక్తి కర రాజకీయం మొదలైంది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలవటం ఖరారైందని చెబుతున్నా..అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చంద్రబాబు, పవన్ పదే పదే చెబుతున్నారు. టీడీపీ తో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సీపీఐ, సీపీఎం పార్టీలు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపటంతో కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు ఖరారైంది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ కూటమి : కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సమయం నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్న..సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరికల పైన ఫోకస్ చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించించగా అనూహ్య స్పందన వచ్చింది. ఇదే సమయంలో బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని నిర్ణయించారు. సీట్ల పంకాల పైన ఈ నెల 26న అనంతపురం సభ తరువాత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కూటమిలో సీబీఐ మాజీ జేడీ పార్టీ కలుస్తుందనే ప్రచారం సాగుతోంది. కానీ, ఇంకా ఆయన నుంచి దీని పైన స్పష్టత రాలేదు. తాజా నిర్ణయంతో ఏపీలో ఎన్డీఏ, ఇండియా కూటమి, వైసీపీ పార్టీలతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది.

వ్యతిరేక ఓటు చీలేనా : ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కలిసి కట్టుగా పోటీ చేయటం ద్వారా జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ అసలు లక్ష్యం. అయితే, కాంగ్రెస్..వామపక్షాలు పొత్తుతో ఆ లక్ష్యం నెరవేరేనా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు టీడీపీ, జనసేనకు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్, వామపక్షాలు పోటీలో నిలుస్తున్నాయి. ఉద్యోగ , ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు వామపక్షాలకు ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నాడు వామపక్షాలతో పొత్తుతో మూడు సీట్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కొంత మేర పెరుగుతుందనే వాదన ఉంది. దీంతో, ఆ పార్టీల సాంప్రదాయ ఓట్ బ్యాంక్ తో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు కూటమలు చీల్చుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..ఎన్నికల రాజకీయం ఏపీలో మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications