కాంగ్రెస్ అభ్యర్దులతో ఏపీలో వారి గెలుపు ఆశలపై నీళ్లు...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు అన్నిఅస్త్రాలను విజయం కోసం ప్రయోగిస్తున్నారు. కూటమి వర్సస్ వైసీపీగా మారిన ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్ట్ మొదలైంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి సైతం రంగలోకి దిగింది. తాజాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్దుల రెండో విడత జాబితాను ప్రకటించారు. ఈ జాబితాతో వైసీపీ, ఎన్డీఏ కూటమిలో టెన్షన్ మొదలైంది. ఓటు చీలక తో పాటుగా ఫలితాల తారు మారు పై అంచనాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ తాజా జాబితాతో
ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయగా, ఇప్పుడు రెండో జాబితా విడదుల చేసింది. లోక్‌సభకు 6, అసెంబ్లీకి 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో పలువురు సీనియర్లను బరిలోకి దించింది. ఎన్డీఏ కూటమి వర్సస్ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నియోజకవర్గాల్లో సీనియర్ల మొహరింపుతో లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది. అందులో ఏలూరు నుంచి కావూరి లావణ్య, నెల్లూరు నుంచి కొప్పుల రాజు, తిరుపతి నుంచి చింతా మోహన్ పోటీలో ఉండనున్నారు. అలాగే టెక్కలి అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన కిల్లి కృపారాణికి స్థానం దక్కింది. పూతలపట్టు నుంచి కూడా వైసీపీ నుంచి వలసొచ్చిన ఎం.ఎస్ బాబుకి టికెట్ లభించింది.

వారి ఆశల పై నీళ్లు
ఈ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఉన్న సమీకరణాలు మారుతున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో తమ మూడు పార్టీలు జత కట్టినట్లుగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చెబుతూ వచ్చాయి. కానీ, షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలను అప్పగించిన సమయం నుంచి కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. షర్మిల ఎంట్రీ.. విమర్శల ద్వారా జగన్ డామేజ్ అవుతారని ఎన్డీఏ కూటమి అంచనా వేసింది. కానీ, చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్, వైసీపీ ఓకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఉన్నాయని..జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు సైతం క్రోసూరు సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

గెలిచేదెవరు - ఓడేదెవరు
ఇక, కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా ఖరారు తరువాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కడప, ఏలూరు పార్లమెంట్ స్థానాల్లో కొత్త సమీకరణాలు చర్చకు కారణం అవుతున్నాయి. పలు చోట్ల కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. అదే సమయంలో వైసీపీలో సీట్లు రాని నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తో వామపక్షాలు జత కట్టటంతో కొన్ని ఆ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉండటంతో ప్రభావం చూపిస్తాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా వైసీపీకి కలిసి వస్తుందని.. ఎక్కడ ఏ మేర ఓట్లు చీలుస్తారనే లెక్కల ఆధారంగా అక్కడి అభ్యర్దుల గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications