కాల్‌మనీ: 'చంద్రబాబే మొదటి ముద్దాయి', ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి: జేపీ
అమరావతి: మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే కాల్‌మనీ లాంటి ఘటనలు చోటు చేసుకునేవి కావని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబే అని ఆరోపించారు.
టీడీపీ మేనిఫెస్టో రెండో ముద్దాయిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే మహిళలు కాల్‌మనీ నుంచి రుణాలను ఆశ్రయించారన్నారు.
ఈ కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, కాబట్టి ప్రభుత్వం నిప్షక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి: జేపీ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల వల్లే కాల్‌మనీ లాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకింగ్ వ్యవస్థను భ్రస్టు పట్టించారని, అందువల్లే ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చెరలో చిక్కుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అంతా ఒక్కటై వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజలను పీక్కుతింటున్నారన్నారు.
కాల్‌మనీ లాంటి వ్యవహారాలతో ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications