అసెంబ్లీ పవర్ పై వైసీపీ పిల్లిమొగ్గలు ? అసెంబ్లీలో అలా-రాజ్యసభలో మరోలా-ఇప్పుడు సుప్రీంలో..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ గతంలో హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానుల ఏర్పాటు అధికారం ఉందంటూ తెలిపింది. అయితే గతంలో రాజ్యసభలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానులపై అధికారం లేదని, దాన్ని కల్పించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం విశేషం

అసెంబ్లీ అధికారాలపై వైసీపీ పిల్లిమొగ్గలు
ఏ రాష్ట్రంలో అయినా రాజధానుల ఏర్పాటు కోసంచట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుందా లేదా అన్న దానిపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఇవాళ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషనే. గతంలో అసెంబ్లీకి రాజధానుల ఏర్పాటు అధికారం ఉందని ఓసారి చట్టాలు చేసి, ఆ తర్వాత హైకోర్టు కొట్టేస్తుందని తెలిసి వాటిని వెనక్కితీసుకుని, ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టులో తిరిగి తమకు అధికారం ఉందంటూ ప్రభుత్వం చేస్తున్న వాదన చర్చనీయాంశంగా మారుతోంది. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలకు రాజధానుల ఏర్పాటు అధికారం కల్పించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు కూడా పెట్టారు.

అసెంబ్లీ అధికారం వాడి రాజధానుల ఏర్పాటు
మూడేళ్ల క్రితం అసెంబ్లీకి ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకునే అధికారం అయినా ఉందని వాదిస్తూ వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెచ్చింది. వీటిపై అసెంబ్లీలో బిల్లులు తెచ్చి ఆమోదింపచేసుకుంది. మండలిలో వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. మండలి కంటే అసెంబ్లీయే పవర్ ఫుల్ అని కూడా వాదించింది. చివరికి మండలిని రద్దు చేసేందుకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. చివరికి రెండేళ్ల తర్వాత ఆ బిల్లుల్ని వెనక్కి తీసేసుకుంది. దీంతో పాటు మరో బిల్లు తెస్తామని కూడా ప్రకటించింది.

రాజ్యసభలో సాయిరెడ్డి ప్రైవేటు బిల్లు
అయితే ఆ తర్వాత హైకోర్టు అసెంబ్లీకి రాజధానులు ఏర్పాటు చేసే అధికారం లేదని తేల్చిచెప్పడంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. అనంతరం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసెంబ్లీకి రాజధానుల ఏర్పాటు అధికారం ఇచ్చేలా చట్టాల్లో మార్పులుచేయాలని కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. తద్వారా తమకు ఆ అధికారం లేదని చెప్పకనే చెప్పారు. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరగకుండానే సభ వాయిదా పడిపోయింది. ఈ వ్యవహారం రాజ్యసభలో ఇంకా పెండింగ్ లోనే ఉంది.

సుప్రీంలో ఇప్పుడు ఇలా..
ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి అసెంబ్లీకి రాజధానుల్ని ఏర్పాటు చేసే అధికారం ఉందంటూ వైసీపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. దీంతో అసెంబ్లీకి అసలు రాజధానుల ఏర్పాటు అధికారం ఉందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అసలు వైసీపీ సర్కార్ కు అసెంబ్లీకి రాజధానుల ఏర్పాటు అధికారం ఉందో లేదో తెలుసా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే సరైన హోంవర్క్ చేయకుండానే ప్రభుత్వం ఈ వాదనతో ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications