బాల సాయిబాబా ఆశ్రమం దగ్గర కరోనా మృతుల ఖననం .. కర్నూలులో వివాదం
కరోనా బారిన పడుతున్న వ్యక్తులకే కాదు కరోనా మహమ్మారికి బలైపోయిన మృతులకు కూడా వివక్ష తప్పటం లేదు . వారిని ఎక్కడ ఖననం చేద్దామన్నా సరే స్థానికుల నుండి ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి మృతదేహాలను ఏం చెయ్యాలి అన్న సందిగ్ధంలో పడేస్తుంది. కరోనా లాక్ డౌన్ తో ఆకలి ఉన్న వారి ఆకలి తీరుస్తూ మానవత్వం చూపిస్తున్న వారే కరోనా పేషెంట్ అంటే , కరోనా మరణం అంటే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు .

కరోనా బాధితులకే కాదు కరోనా మృతదేహాలకు కష్టాలు
భారతదేశం తో పాటు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో అతలాకుతలమవుతున్నా ప్రజల వైఖరి మాత్రం మారటం లేదు . కరోనా లక్షణాలు ఉంటేనే ప్రజలు వెంటనే భయపడుతూ వారి నుంచి దూరంగా వెళ్తున్నారు. కరోనా సోకిన వ్యక్తులపై మాత్రమే కాదు మరణించిన వారిపై కూడా వివక్ష కొనసాగుతుంది . ప్రజలు మానవత్వం మరచి వారి అంత్యక్రియలకు సహకరించడం లేదు. ఈ సందర్భంలో కరోనా మృత దేహాల ఖననం, దహనానికి చాలాచోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో మరణం తర్వాత కూడా కష్టాలు కొనసాగడం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

బాలసాయిబాబా ఆశ్రమ సమీపంలో ట్రస్ట్ భూమిలో కరోనా మృతుల మృతదేహాల ఖననం
తాజాగా కర్నూలు నగరంలో కరోనా మృతదేహాల ఖననం వివాదాస్పదంగా మారింది. కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడు సమీపంలోని భగవాన్ బాలసాయిబాబా ఆశ్రమం దగ్గర కరోనాతో మృతి చెందిన రెండు మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా వివాదంగా మారింది. స్థానిక ప్రజల భయానికి కారణం అవుతుంది . దీంతో అక్కడ మునగాలపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పూడ్చిపెట్టిన శవాలను వెలికితీయాలని అక్కడ నుండి తరలించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం బాలసాయిబాబా ట్రస్టుకు చెందినదని శవాలను ఖననం చేయడానికి వీలులేదని అన్నారు.
Recommended Video

మృతదేహాలను వేరే చోటికి తరలించకుంటే జేసీబీలతో మేమే తరలిస్తామన్న గ్రామస్థులు
అక్కడ సమీపంలో ప్రజలు నివసిస్తున్నారని, కరోనా మృతులను పాతిపెట్టటం వలన కరోనా వస్తుందని భయపడుతున్నారని అంటున్నారు . అయితే ట్రస్టు నిర్వాహకుల అనుమతితోనే అంత్యక్రియలు చేశామని శవాలను పూడ్చిపెట్టినవారు చెప్పారు. అయితే ఆ మృత దేహాలను వెలికితీయకపోతే, అక్కడ నుండి తీసుకు వెళ్లకపోతే తామే జేసీబీలతో శవాలను వెలికితీసి మరోచోటికి తరలిస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారి తీయకుండా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు మృతుల తరపు బంధువులు .












Click it and Unblock the Notifications