సీఎం జగన్ కీలక నిర్ణయం: ఏపీలో 16 కోట్ల మాస్కులు ఉచిత పంపిణీ, ఒక్కొక్కరికి మూడు
అమరావతి: కరోనావైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

16 కోట్ల మాస్కులు ఫ్రీ..
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. కరోనా ప్రభావితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 1.43 కోట్ల కుటుంబాలపై మూడో విడత సర్వే పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు.

ఆ 32,349 మందికీ పరీక్షలు నిర్వహించండి..
శనివారం రాత్రి వరకు 32,349 మందిని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రిఫర్ చేయగా.. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే, 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా, కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కొవిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

వారికి మెరుగైన చికిత్స అందించాలి.. భౌతిక దూరం తప్పనిసరి..
కరోనావైరస్ వ్యాప్తి, ఉధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతర వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చి, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సిందేనని సీఎం జగన్ అన్నారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కేంద్రం సూచన.. ఏపీలో అమల్లోకి..
ఇది ఇలావుండగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు సీఎం జగన్. కరోనా నియంత్రణకు కేంద్రం చేసిన మరో సూచనను అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కారు. జగన్ సర్కారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ, పొగాకు వంటి ఉత్పత్తులు నమిలి ఉమ్మివేయడంపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి ఐపీసీ, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్షలు విధిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, ఆదివారం ఉదయం వరకు ఏపీలో 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.












Click it and Unblock the Notifications