ఏపీలో కోవిడ్ మరణాలు: రాష్ట్రాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియంట్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఏపీలోని కడప జిల్లాలో ఇద్దరు కోవిడ్-19తో మృతిచెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2022 తర్వాత ఏపీలో కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. మరో 8 మందికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. వారిని పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇవి చెదురుమదురు కేసులు మాత్రమేనని.. వీటిని కొత్త వ్యాప్తిగా పరిగణించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆ రెండు మరణాలు ఎలా సంభవించాయి?
తొలి బాధితుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో చేరిన 60 ఏళ్ల వ్యక్తి. ఆ తర్వాత అతడిని పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ రోగికి మధుమేహం, కిడ్నీ వ్యాధితో సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉండగా.. జూన్ 28న చికిత్స పొందుతూ మరణించాడు. మరణానంతరం నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో అతనికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత జులై 7న కడపలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్ర ఆయాసం, నిరంతర దగ్గుతో ఆసుపత్రిలో చేరిన ఆ రోగి.. రెండు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడం, న్యుమోనియా కారణంగా మరణించాడు. అతనికి ఛాతీ సీటీ స్కాన్ చేసినప్పుడు, కోవిడ్-19 కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ కేసులు అకస్మాత్తుగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ చర్యలను ప్రారంభించింది. "కడపలో ఐదు కేసులు గుర్తించగా.. మిగిలిన మూడు వారి కాంటాక్టులు కావడం విశేషం. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. ఇది చెదురుమదురు కేసులు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు" అని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అన్నారు . ఇది వ్యాప్తి కాదని.. నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యలు ఇప్పటికే అమలులో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌కు వైరస్ రకం కారణమా అనే విషయంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. పేషెంట్లలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నందువల్ల దీనికి తీవ్రమైన ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు కడప జిల్లా ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడు వెల్లడించారు.
ఇది ఆందోళన కలిగించే విషయమా?
కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత అంటువ్యాధిగా పరిగణించబడుతుంది. ఇది ఊపిరితిత్తులలో కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మొదట్లో కుప్పకూలిపోయాయి. గత డెల్టా వేవ్‌లలా కాకుండా, ఈ ఒమిక్రాన్ వేవ్ వల్ల పిల్లలు కూడా ప్రభావితమయ్యారు. అయితే జనాభాలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల, మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా సగటున తక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగించాయి. గత 6 రోజులుగా కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని.. ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీ కూడా కొత్త సబ్‌వేరియంట్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పిందని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఇప్పుడు ఏం చేయాలంటే?
ఏపీలో అకస్మాత్తుగా కోవిడ్ మరణాలు నమోదు కావడంతో ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైనప్పటికీ.. వైద్యారోగ్య శాఖ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్పటికీ.. వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణలు సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications