ఏపీలో కరోనా: అప్రమత్తత, ఆంక్షలు -కొత్తగా 2,345 కేసులు, 16 మరణాలు -మోదీకి జగన్ కీలక రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతున్నది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతూ, రెండు కోట్ల డోసులు దిశగా పయనిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన కరోనా సమీక్షలో ఏపీ సీఎం జగన్ కీలక సూచనలు, అభ్యర్థనలు చేశారు. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,345 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,31,555కు పెరిగింది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 508 కేసులు, చిత్తూరు 332, ప్రకాశం 243, నెల్లూరు 228, పశ్చిమ గోదావరి 229, కృష్ణా 238, అత్యల్పంగా కర్నూలులో 29 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కొత్త కేసులతోపాటే కొవిడ్ మరణాలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే మహమ్మారి కాటుకు 16 మంది బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,097కు పెరిగింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చనిపోయారు.
కొవిడ్ బారి నుంచి గడిచిన 24 గంటల్లో 3,041 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,93,604కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,854గా ఉంది. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ 2.8 శాతంగా, రికవరీ రేటు 98 శాతం, మరణాల రేటు 0.68 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,
కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏకైక ఆయుధం వ్యాక్సినే అని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న హితబోధను ఏపీ సీరియస్ గా ఫాలో అవుతున్నదని, రాష్ట్రంలో ఇప్పటి(శుక్రవారం) వరకు మొత్తం 1,76,70,642 (1.76 కోట్ల) డోసుల టీకాలను పంపిణీ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. సీఎంలతో ప్రధాని నిర్వహించిన కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడుతూ, ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తోన్న వ్యాక్సిన్లు వృథాగా పోతున్నాయని, ఆ కోటాలోని టీకాలను కూడా ప్రభుత్వానికి తరలిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుందని, ఈ దిశగా కేంద్రం ఆలోచన చేయాలని మోదీకి జగన్ సూచించారు. అలాగే,
ఏపీలో కొవిడ్ మూడో దశ వ్యాప్తి భయాల నేపథ్యంలో జగన్ సర్కారు అలర్ట్ అయింది. బక్రీద్ పండుగ సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో గుమ్మికూడొద్దనే ఉద్దేశంతో మసీదుల్లో ప్రార్థనలపై ఆంక్షలు విధించింది. ఈనెల 20 లేదా 21 తేదీల్లో బక్రీద్ పండుగ ఉండగా, ఆ రోజు రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో 50 శాతానికి మించి ఆక్యుపెన్సీ ఉండరాదని, ప్రార్థనల సమయలో కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications