రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీపీఐ నారాయణ కౌంటర్-జేబులు కొట్టే వాళ్లంతా..
ఏపీలో తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ను జాతీయ, అంతర్జాతీయ నేత అంటూ ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు గొప్పతనం గురించి ఏపీలో ఉన్న వారి కంటే బయట ఉన్న వారే ఎక్కువగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతలంతా రజనీపై ఎదురుదాడికి దిగారు.
రజనీకాంత్ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన మాటలపై వెంటనే స్పందించిన వైసీపీ నేతలు రెండు రోజులుగా తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రజనీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇవాళ చంద్రబాబు సైతం రంగంలోకి దిగి వారికి కౌంటర్ ఇచ్చారు. రజనీని విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మేసినట్లేనంటూ ఓ ట్వీట్ కూడా చేశారు.

ఇప్పుడు అదే క్రమంలో వైసీపీ నేతల విమర్శలపై సీపీఐ నారాయణ కూడా ఘాటుగా స్పందించారు. వైసీపీ మంత్రులు రజనీపై చేస్తున్న విమర్శల్ని ఇవాళ మేడే వేడుకల్లో పాల్గొన్న నారాయణ తప్పుబట్టారు. రజనీకాంత్ వైసీపీని ఒక్కమాట కూడా అనకపోయినా ఆయన్ను విమర్శించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబును పొగిడినంత మాత్రాన రజనీ వంటి నటుడిపై విమర్శలు చేస్తారా అని నిలదీశారు.
చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ మాట్లాడిన తర్వాత ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేబులు కొట్టే వాళ్లంతా రజనీకాంత్ ను విమర్శిస్తున్నారంటూ సీపీఐ నారాయణ సంచలన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు నారాయణ తన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని తప్పుబడుతూ ట్విట్టర్ లో సైతం వైసీపీ అపాలగైజ్ టూ రజనీ అంటూ ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications