మంత్రి బుగ్గనకు సీపీఐ రామకృష్ణ థ్యాంక్స్-ఎట్టకేలకు ఆ సీక్రెట్ బయటపెట్టినందుకు ?
ఏపీలో మూడు రాజధానుల వెనుక ఉన్న రహస్యం బయటపెట్టినందుకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ధన్యవాదాలు చెప్పారు సీపీఐ రామకృష్ణ.
ఏపీలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిన్న ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. దీనికి కారణం మూడు రాజధానులపై బెంగళూరులో ఆయన చేసిన వ్యాఖ్యలే. ముఖ్యంగా మూడు రాజధానుల్ని జగన్ సర్కార్ ఎందుకు తెరపైకి తెచ్చిందనే విషయంపై బుగ్గన చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో బుగ్గన కామెంట్స్ పై విపక్షాలు స్పందిస్తున్నాయి.
మూడు రాజధానులపై బుగ్గన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాజధాని అంశంపై వైసీపీ మర్మాన్ని బయటపెట్టిన ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డికి అభినందనలు అంటూ రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని అంశంపై జగన్ సర్కార్ ముందు నుండి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని,
విశాఖ రాజధానిని ప్రజలు అంగీకరించరనే కారణంతో మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని ఆయన పేర్కొన్నారు.
తద్వారా రాష్ట్ర ప్రజల్ని ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

రాయలసీమ ప్రజల సపోర్టు పొందటానికి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతుందని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేసినప్పుడే వైసీపీ ద్వంద వైఖరి అర్థమైందన్నారు. మూడు ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకునే మోసకారి సీఎం రాష్ట్రానికి అవసరమా? అని రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో రిఫరెండం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని రామకృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications