చంద్రబాబు అరెస్టును ఖండించిన సీపీఐ-కక్షసాధింపేనన్న నారాయణ...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ ఇవాళ అరెస్టు చేయడాన్ని సీపీఐ ఖండించింది. చంద్రబాబు అరెస్టు వైకాపా అరాచకాలకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు వంటి వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైకాపా దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. వైసీపీ పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు. అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు.

వైకాపా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ తెలిపారు. అటు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా తెలిపారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చన్నారు. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
అలాగే నారా లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఇళ్లలో నిర్బంధించటం కూడా దుర్మార్గమని రామకృష్ణ తెలిపారు. మార్గదర్శిపై ఇప్పటికే సీఐడీ దుందుడుకుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాలను వేధించటానికి ఇది పరాకాష్ట అన్నారు. దీనిపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications