ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం..! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే ?
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ కూ పోలింగ్ కు దాదాపు 50 రోజుల పైగా గ్యాప్ రావడం, రాజకీయ పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈసీ కూడా ఓట్ల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వంటి కారణాలతో పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన ఏపీ ఎన్నికల ఫలితంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.
ఇలాంటి తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు తమదైన జోస్యాలు చెప్పేస్తున్నారు. వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం చేసేది మా నాయకుడని ఒకరు చెప్తుంటే, కాదు 9న మా నాయకుడే ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని మరో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ అధ్యయన సంస్థ సీఎస్డీఎస్ లో సీనియర్ సెఫాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు. ఓ చర్చా గోష్టిలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. అయితే ఈ పోరులో టీడీపీదే పైచేయి అయిందని ఆయన విశ్లేషించారు. పసుపు పార్టీవైపే ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అయితే వైసీపీ, టీడీపీ గెలిచే సీట్లపై మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండటంతో నంబర్లు చెప్పకపోయినా టీడీపీ గెలవబోతోందనే సంకేతం ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు లేకపోయినా టీడీపీతో జట్టు కట్టడం వల్ల కొన్ని ఎంపీ సీట్లు గెల్చుకోబోతోందని సంజయ్ కుమార్ వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ బలంగానే ఉందని, ఈసారి జాతీయ స్ధాయిలో ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు లేకపోయినా బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఉందని ఆయన చెప్తున్నారు.












Click it and Unblock the Notifications