Cyclone Akvan: తుని నుంచి విశాఖకు విస్తరించిన తుఫాన్-రాత్రికి తీవ్రం-ఐఎండీ అప్డేట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా, ఆ తర్వాత అక్వాన్ తుఫాన్ (Cyclone Akvan)గా మారింది. దీని పరిధిని నిన్నటి వరకూ నెల్లూరు నుంచి తుని మధ్య అని అంచనా వేసినా, ఇవాళ మాత్రం దీన్ని విశాఖవరకూ విస్తరించినట్లు వాతావరణ విభాగం గుర్తించింది. దీంతో నెల్లూరు-విశాఖ మధ్య అక్వాన్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నెల 20న ఈ తుఫాన్ తీరం దాటబోతున్నట్లు వెల్లడించింది.
అక్వాన్ తుపాను ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా, నవంబర్ 19 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది నవంబర్ 20 మధ్యాహ్నం సమయానికి నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. అక్వాన్ తుఫాను ఇవాళ, రేపు తమిళనాడులో, 19-20 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ లో, 21 నవంబర్ న ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలను, బంగాళాఖాతంలో ఈదురు గాలులతో పాటుగా తీసుకువస్తుందని వాతావరణ విభాగం పేర్కొంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కూడా తుఫాన్ పై తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ కేంద్రీకృతం అయి ఉందని తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు తెలిపింది. ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించింది. కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.














Click it and Unblock the Notifications
