తుపాన్ పై ఏపీలో హై అలర్ట్.! 27 కోట్లు విడుదల-వాట్సాప్ లోనే ఫిర్యాదులు..!
ఏపీవైపు దూసుకొస్తున్న అర్ణబ్ తుపాన్ (Cyclone Arnab)ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ముందస్తుగా రూ.27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వాట్సాప్ మనమిత్ర ఛానల్ ద్వారా తుఫాన్ పై ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాట్సాప్ లో ఆప్షన్ కూడా ఇచ్చారు. అర్నబ్ తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు గంట గంటకూ సమీక్షిస్తున్నారు. తుఫానుతో రేపు ఎల్లుండి భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం వర్చువల్‌గా సమీక్షించారు. రేపటి కల్లా తీవ్ర తుఫానుగా మారి ఇది రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికల రీత్యా ఆయా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28వ తేదీన ఆర్నబ్ తీవ్ర తుఫాను బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుఫాను కారణంగా రేపు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే తీరప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సీఎంకు తెలియచేశారు.

తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 28,29 తేదీల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అర్నబ్ తుఫాన్ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించాలని సీఎం నిర్దే్శించారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, శిశువులకు తొలి ప్రాధాన్యతనిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం స్పష్టం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా తీరప్రాంతానికి తిరిగి రప్పించామని అధికారులు వివరించారు. అలాగే పంటనష్టం జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలిపే అవకాశం కల్పించారు. తుపాన్ సమయంలో కరెంటు సమస్యలు, చెట్లు కూలినా, గోడలు కూలినా, నీళ్లు వచ్చినా ఇంకే సమస్య ఎదురైనా మనమిత్ర ద్వారా అధికారులకు తెలియజేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ చేయాలని, అక్కడున్న సేవల ఆప్ఫన్ ఎంపిక చేసుకోవాలని, అర్నబ్ సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలని, రిపోర్ట్ ఇష్యూ ని ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలని, తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలని, తరువాత మీ పేరు, జిల్లా, మండలం నమోదు చేసి, మీ ప్రాంతంలో తుపాన్ కారణంగా ఎదురవుతున్న సమస్యను అందులో నమోదు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఫొటోలు కూడా అప్ లోడ్ చేయొచ్చని తెలిపింది.













Click it and Unblock the Notifications
