Cyclone Michaung: ఏపీ తీరం వైపు తరుముకొస్తూ..!!
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయాల గగనతలంపై కేంద్రీకృతమైన ఈ వాయుగుండం క్రమంగా తుఫాన్‌గా మారుతుందని, దీనికి అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ నాటికి తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది.
క్రమంగా అండమాన్ నికోబార్ ద్వీపానికి పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, 4 5, తేదీల్లో ఏపీ తీరానికి సమీపిస్తుందని వివరించింది. దీని ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ- కర్ణాటక సరిహద్దుల ప్రాంతాల పైనా తుఫాన్ ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.

ఈ తుఫాన్‌కు మిఛౌంగ్ (Cyclone Michaung) అని పేరు పెట్టారు. ఏపీ తీర ప్రాంత జిల్లాలన్నింటిపైనా ఓ తుఫాన్ ప్రభావం ఉండొచ్చు. కృష్ణా మొదలుకుని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చు.
ఏపీ దక్షిణ ప్రాంతంలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్నటికి మొన్న తిరుమలలో కుండపోతగా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కొద్దిరోజులుగా తమిళనాడును అతి భారీ వర్షాలు కకావికలం చేస్తోన్నాయి. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, నాగపట్నం, రామనాథపురం, కరైకల్, పుదుచ్చేరిల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుంది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications