Cyclone Montha: ఏపీ రోడ్లపై వాహనాల నిలిపివేతకు సర్కార్ ఆదేశాలు..!
ఏపీలో మొంథా తుపాను ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న కోస్తా జిల్లాల్లో సైతం సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. తుపాను ఇవాళ అర్థరాత్రికే తీరం దాటుతుందన్న సంకేతాలు ఓవైపు, కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చుకోవడం మరోవైపు టెన్షన్ పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రాకపోకలపై ఆంక్షలు విధిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్ టి జి ఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా జిల్లాలనుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ఆయా జిల్లాల్లోని ప్రజలంతా ఇండ్ల లోనే ఉండాలని, బయటకు రావద్దని, అప్రమత్తతతో మెలగాలని సూచించింది.

అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేల్లో సైతం ప్రైవేటు, వాణిజ్య వాహనాల ప్రయాణం పూర్తిగా నిషేధించారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారరు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా రోడ్లపై ప్రయాణాలు చేయకుండా సహకరించాలన్నారు. ఈ ఆంక్షలు ఎవరి వ్యక్తిగత అసౌకర్యం కోసం కాకుండా, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడడమే లక్ష్యంగా అమలులోకి తెచ్చామన్నారు.

తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ నిబంధనలు ఉపసంహరిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ సమయంలో మాత్రం ప్రజలు శాంతంగా ఉండి, పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలన్నారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ, పోలీస్ శాఖ నుండి జారీ అయ్యే హెచ్చరికలు, సూచనలు తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కొరకు డయల్ 112కి లేదా సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications