బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
రుతుపవనాలతో సంబంధం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు చలికాలం, వేసవిలోనూ అసాధారణంగా వాతావరణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. వాతావరణం ఎప్పుడు మారుతుందో అంచనా వేయడం కష్టతరంగా మారింది. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేశాయి. ఈ పరిణామాలు కొన్ని చోట్ల వర్షాలకు కారణమౌతోండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతకు దారి తీస్తోంది.
తాజాగా పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది చురుకుగా కదులుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రత్యేకించి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని హెచ్చరించింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగిపడొచ్చని, పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
హోర్డింగ్‌లు, కటౌట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో మార్చి మధ్యలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు ప్రారంభమవుతాయని 'తెలంగాణ వెదర్‌మ్యాన్' హెచ్చరించారు. మార్చి 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. గత నెలలో కురిసిన వర్షాల కంటే ఈసారి భారీగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications