ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
వైద్యో నారాయణో హరి అంటారు.. అంటే వైద్యుడు దైవంతో సమానం. ఎటువంటి పరిస్థితులలోనైనా వైద్యులు తమ వైద్య వృత్తిని పాటించాలి. ప్రజల ప్రాణాలను కాపాడటమే వైద్యుల ప్రథమ కర్తవ్యం కావాలి. ఇక ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ నుండి దర్శి నియోజకవర్గానికి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి.
గర్భిణీ మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన టీడీపీ అభ్యర్థి
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న సమయంలో, ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతూ సి సెక్షన్ ఆపరేషన్ చేయడానికి వైద్యులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక గర్భిణీ మహిళకు సిజేరియన్ చేసి తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలు కాపాడారు.

సమయానికి సిజేరియన్ చేసే వైద్యులు లేక గర్భిణీ ఇబ్బంది
దర్శి మండలం అబ్బాయి పాలెంకు చెందిన వెంకటరమణ అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో దర్శిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో అందుబాటులో గైనకాలజిస్టు లేకపోవడం వల్ల ఆమెను ఒంగోలుకు కానీ, గుంటూరుకు గానీ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.
డెలివరీ చేసిన టీడీపీ అభ్యర్థి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అక్కడి నుంచి తీసుకు వెళ్ళడానికి సమయం కానీ, అందుకు కావలసిన ఆర్థిక వనరులు కానీ వారికి లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టికి ఈ విషయం సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి గర్భిణీకి అత్యవసర ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.

ప్రచారాన్ని పక్కనబెట్టి డెలివరీ
ఎన్నికల సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ప్రత్యర్ధుల మీద గెలుపు సాధించడానికి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి డాక్టర్. గొట్టిపాటి లక్ష్మీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గా తన ధర్మాన్ని నిర్వర్తించారు. గర్భిణీ మహిళ తాలూకు కుటుంబ సభ్యులతో పాటు, స్థానికంగా పలువురు గొట్టిపాటి లక్ష్మీ అందించిన సేవలను కొనియాడారు .












Click it and Unblock the Notifications