టీడీపీలోకి ఆ ఇద్దరు వైసీపీ నేతలు?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమవడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మచిలీపట్నంలో రాత్రివేళ సభ జరిగినా ప్రజలు ఓపికగా వేచిచూడటం, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్ షోలకు స్వచ్ఛందంగా తరలిరావటాన్ని బట్టి ప్రజలంతా చంద్రబాబును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని తెలుగు తమ్ముళ్లు ఆనందంతో చెబుతున్నారు.
భుజస్కంధాలపై బాబు పర్యటన :చంద్రబాబు పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు దాసరి బాలవర్ధన్ రావు, దాసరి జై రమేష్ ఏర్పాట్లన్నీ చూడటం విశేషం. ఈ నేతలిద్దరూ చంద్రబాబు పర్యటనలో పాల్గొనడం, ఆయనకు స్వాగతం పలకడం, ఫ్లెక్సీల ఏర్పాటు.. తదితర పనులన్నంటినీ తమ భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా దాసరి బ్రదర్స్ కు మంచి పట్టుంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వారిద్దరూ తాజాగా టీడీపీలో చేరడమే తరువాయి అంటున్నారు.

గన్నవరం నుంచి బరిలోకి :1999, 2009 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి దాసరి బాలవర్ధన్ రావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీ పోటీచేయడం దాదాపుగా ఖాయమైంది. ఈ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీచేయడానికి దాసరి బాలవర్ధన్ రావు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ ఛార్జి లేకపోవడం, బచ్చుల అర్జునుడు ఇటీవలే మృతిచెందడంతో అంగబలం, అర్థబలం ఉన్న దాసరి సోదరులు పసుపు కండువా కప్పుకోవడం ఖాయమేనని చెబుతున్నారు. పార్టీలో చేరిన తర్వాత అధినేత నుంచి గన్నవరం నియోజకవర్గంపై వీరికి హామీ లభించిందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications