సీబీఐకి ''అన్ని విషయాలు'' వివరించిన దస్తగిరి!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరి మరోసారి కడప ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. పులివెందుల నుంచి కడప వచ్చిన దస్తగిరి ముందుగా సీబీఐ అధికారులను కలిసి తనకు ఎదురవుతున్న ముప్పును తెలియజేశారు. వారం రోజుల క్రిందట తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అకస్మాత్తుగా చనిపోయిందని, ఇందులో కచ్చితంగా కుట్ర దాగివుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తన ఇంట్లో 2వ తేదీన కుక్క చనిపోతే 6వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురు వచ్చి కుక్కను కొంటామన్నారని, అయితే ఇందులో ఏదో కుట్ర దాగివుందనే అనుమానాన్ని దస్తగిరి వ్యక్తం చేశారు. కుక్క చనిపోవడం, ఆ తర్వాత కుక్కను కొంటామంటూ రావడం.. తాను ఇంటివద్ద లేని సమయంలో రావడంలాంటివి చూస్తే కచ్చితంగా అనుమానం కలుగుతోందని దస్తగిరి తన పిర్యాదులో తెలిపారు. ఈ అంశాలపై విచారణ చేయాలంటూ ఎస్పీ అన్బురాజన్ ను కోరారు. రెండురోజల కిందటే తన గన్ మెన్లను మార్చారంటూ దస్తగిరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. సీబీఐ అధికారులకు దస్తగిరి పలు విషయాలను కూలంకుషంగా వివరించినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా తాను అనుమాన పడిన అంశాలను దస్తగిరి ఒక లేఖ రూపంలో అధికారులకు అందజేశాడు.

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఆయన కారు డ్రైవరైన దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు ఎలా సవాల్ చేస్తారంటూ ఆ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం కడప, పులివెందులలో సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తోంది.