తృణమూల్ కాంగ్రెస్ లో భారీ సంక్షోభం..! దీదీకి వరుసగా నేతల గుడ్ బై..!
పశ్చిమ బెంగాల్‌లో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ (TMC) క్రమంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. తాజాగా దాదాపు వంద మంది టీఎంసీ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీకి కష్టాలు మరింత పెరిగాయి. క్షేత్ర స్థాయిలోని కల్లోలం సీనియర్ నాయకులలోనూ కనిపిస్తోంది. పలువురు బహిరంగంగానే మమతా బెనర్జీ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్నారు. టీఎంసీ చరిత్రలోనే ఇది అత్యంత క్లిష్టమైన సమయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తృణమూల్ లో సంక్షోభం (TMC)
ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్, ఒక్క ఓటమితో పూర్తిగా బలహీనపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత లోక్‌సభ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ వంటి సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. మరోవైపు టీఎంసీ నియంత్రణలో ఉన్న స్ధానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రాజీనామాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ మునిసిపాలిటీలకు చెందిన సుమారు 100 మంది కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు. ఈ రాజకీయ ప్రకంపనలు టీఎంసీ ఆధీనంలో ఉన్న మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో బీజేపీకి బలపడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

స్ధానిక ఎన్నికలకు ముందే రాజీనామాల పర్వం
రాజకీయ సంక్షోభం తీవ్రత ఎంతగా ఉందంటే, వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలకు జరగకముందే పలు మునిసిపల్ బోర్డులు రద్దు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆజ్‌తక్ బంగ్లా నివేదిక ప్రకారం, మమతకు సన్నిహితుడు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు రాజీనామాలు చేయవద్దని మమత తాజాగా విజ్ఞప్తి చేసినా.. బెంగాల్ స్థానిక సంస్థలలో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో అవి కొనసాగుతూనే ఉన్నాయి. మమతా బెనర్జీ 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి టీఎంసీని స్థాపించినప్పటి నుండి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఇదే.

సువేందు హెచ్చరికల ఫలితమేనా ?
సువేందు అధికారి ప్రభుత్వం గత స్థానిక సంస్థల కార్యకలాపాలను పూర్తిగా పరిశీలిస్తుందని, దాని ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన తర్వాత రాజీనామాల పరంపర మొదలైంది. కొన్ని మునిసిపాలిటీలలో టీఎంసీ కౌన్సిలర్లు తమ కార్యాలయాలకు వెళ్లడం కూడా పూర్తిగా మానేశారు. అక్కడ ప్రభుత్వం అధికారుల్ని నియమించడం ప్రారంభించింది. ఇదే క్రమంలో టీఎంసీకి చెందిన కౌన్సిలర్లపై అవినీతి, వసూళ్ల ఆరోపణలతో వరుస అరెస్టులు పార్టీలో మరింత ఆందోళనను పెంచాయి. గత వారం, ముగ్గురు కౌన్సిలర్‌లు వసూళ్లు,బెదిరింపుల ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ఈ పరిణామాలు టీఎంసీకి పెద్ద దెబ్బగా మారాయి.














Click it and Unblock the Notifications