జనగణన పేరుతో డేటా చోరీ ? ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ ఎందుకు ?
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనాభా గణనలో (Census) భాగంగా ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ వివరాలు తీసుకోవాలన్న నిర్ణయంపై విమర్శలు మొదలయ్యాయి. కీలకమైన ఈ వివరాలను తీసుకోవడం ద్వారా పౌరుల డేటా చోరీ చేయబోతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) .. ఇదే ప్రశ్న వేస్తూ ట్వీట్ చేశారు.
జనాభా గణన సమాచారంలో భాగంగా మొబైల్ నంబర్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, ఆధార్ మొదలైన వివరాలను సేకరించడం చట్టవిరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తెలిపారు. ఇది జాతీయ శాసనాన్ని, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇది స్పష్టంగా డేటా చోరీకి (Data Chori) ఒక ఉదాహరణ అని పీవీ రమేశ్ తేల్చిచెప్పారు. భారత జనాభా గణన చట్టం 1948లోని సెక్షన్ 15 ప్రకారం జనాభా గణన కేవలం ఒక గణాంక సాధనం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. దీన్ని ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగించరాదని ఆయన స్పష్టం చేశారు.

Collecting mobile number, Voter ID, Passport, Aadhar etc., as part of #Census data is illegal and violative of national statute and international covenants. That's a clear case of #DataChori
— Dr PV Ramesh (@RameshPV2010) September 30, 2026
Section 15 of India's Census Act 1948 states that #Census is 'strictly a statistical tool…
అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల్లోని 6వ సూత్రం ప్రకారం గణాంక సంస్థలు సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని పీవీ రమేశ్ తెలిపారు. అలాగే ఈ సమాచారాన్ని కేవలం గణాంక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని గుర్తుచేశారు. SIR లాగే, ప్రస్తుత జనాభా గణన కూడా సమాచారాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడానికి శాసనాన్ని, అంతర్జాతీయ పద్ధతులను, గత నిర్ణయాలను, నిబంధనలను ఉల్లంఘించే మరో చర్య అవుతుందని పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా పౌరుల డేటా చోరీ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఈసీ కూడా పలుమార్లు వివరణలు ఇచ్చింది. అయినా విమర్శల జడి ఆగడం లేదు. ఇలాంటి సమయంలో జనగణనలోనూ ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ వివరాలు తీసుకోవడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications
