తిరుమల లడ్డూపై హెరిటేజ్ కేసులో కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు
తిరుమల లడ్డూ వివాదంతో హెరిటేజ్ ఫుడ్స్‌ను ముడిపెడుతూ ఓ దినపత్రిక ప్రచురించిన వార్తా కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌పై వివాదాస్పద కథనాలను ప్రచురించినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ తీర్పు ఇచ్చారు. జగతి పబ్లికేషన్స్ 24 గంటల్లోగా కథనాలను తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ఆదేశించారు.
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు భోలే బాబా డెయిరీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ ఆ పత్రిక ఈ నెల 14వ తేదీన ఢిల్లీ ఎడిషన్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపించిన కుట్రల వెనుక అసలు రహస్యం క్రమంగా బయటపడుతోందని, ఈ వివాదానికి మూలమైన భోలే బాబా డైరీతో చంద్రబాబు కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. తిరుమల లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిందని భోలే బాబా ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.

ఈ కథనం పూర్తిగా నిరాధారమైనదని, అవాస్తవమని హెరిటేజ్ ఫుడ్స్ వాదించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం పిటీషన్ దాఖలు చేసింది. తాము భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్‌తో వ్యాపారం చేస్తున్నామని, నిందితుడైన భోలే బాబా ఆర్గానిక్ మిల్క్ నుంచి ఈ సంస్థ పూర్తిగా భిన్నమైనదని పిటీషన్ లో స్పష్టం చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ తరపున న్యాయవాదులు సందీప్ సేథీ, అనురాగ్ అహ్లూవాలియా తమ వాదనలు వినిపించారు.
ఆ పత్రికలో ప్రచురితమైన కథనంలో పొందుపరిచిన విషయాలు, ఆరోపణలన్నీ అభ్యంతరంకరమైనవి, కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు కోట్లాదిమంది శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులు భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది హెరిటేజ్ ఫుడ్స్ యాజమాన్యం. తద్వారా తమ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులపై ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలియజేసింది.
తిరుమల లడ్డూ వివాదం 2024లో తలెత్తింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల వేంకటేశ్వర ఆలయం పవిత్ర లడ్డూలను బీఫ్ టాల్లో, లార్డ్ వంటి జంతు కొవ్వులతో కల్తీ చేసిన నెయ్యితో తయారు చేస్తోన్నారని అప్పట్లో చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తన తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications