ఎన్నికల వేళ.. సీనియర్ ఐఎఎస్ గంధం చంద్రుడు ఆసక్తికర పోస్ట్
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర నేటికి 11వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి పల్నాడు జిల్లాలో అడుగుపెడతారు.

ఈ ఉదయం దర్శి నియోజకవర్గంలోని పొదిలిలో పింఛన్‌దారులతో జగన్ ముఖాముఖి సమావేశమౌతారు. వారి అభిప్రాయాలను సేకరిస్తారు. 12 గంటలకు పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు వినుకొండలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు గంటావారి పాలెం క్యాంప్‌లో బస చేస్తారు.
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా గళం పేరుతో ప్రచార సభల్లో పాల్గొంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. రోడ్ షోలతో జనంలోకి దూసుకెళ్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య- సీనియర్ ఐఎఎస్ అధికారి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో వాటిని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ఎలాంటి నాయకత్వం ఉండాలి? ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలనే విషయంపై తన అభిప్రాయాలను క్లుప్తంగా పంచుకున్నారాయన.
నైజీరియాకు చెందిన ఆఫ్రికన్ కవి చినువా అచెబె పంక్తులను ఆయన పోస్ట్‌లో పెట్టారు. క్రియాశీలక, బలమైన ప్రజాస్వామ్యం కావాలంటే ఆరోగ్యవంతమైన, చదువుకున్న, ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. చదువుకున్న, మంచివారైన నాయకులు ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications