పవన్ టీంలో పవర్ ఫుల్ ఐఏఎస్, ఏరికోరి - సీఎం ప్రత్యేక అనుమతి..!!
ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తన శాఖల పైన పవన్ వరుస సమీక్షలు నిర్వహించారు. తన విధానం ఏంటో అధికారులకు స్పష్టం చేసారు. ఇక..తన శాఖల నిర్వహణ కోసం టీం ఎంపిక పైన పవన్ ఫోకస్ చేసారు. ఇందులో భాగంగా తన ఓఎస్డీగా పవన్ ఒక పవర్ ఫుల్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకున్నారు. నిబంధనలు సడలించి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
పవన్ ఏరి కోరి ఎంపిక
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన టీమ్ లో అధికారులను ఏరి కోరి ఎంపిక చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ రానన్నారు. సాధారణంగా ఆర్డిఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు.

కలెక్టర్ గా సేవలు
ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణ తేజ గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలా పూజ జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట చెందిన కృష్ణ తేజ తాజాగా సచివాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు. త్రిసూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణ తేజ అందించిన సేవలను పవన్ కళ్యాణ్ అభినందించారు.

పవన్ ఓఎస్డీగా
కృష్ణ తేజ సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన కృష్ణ తేజ 2023లో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన 69 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అధికారిగా అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసిన కృష్ణ తేజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీ గా పని చేయనున్నారు.












Click it and Unblock the Notifications