కేరళం నుండి తిరిగొస్తూ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. కేరళ సీఎం స్వీట్ రిప్లై!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స తర్వాత కేరళలో ఆయుర్వేద చికిత్స కోసం వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే చికిత్స పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్టుకు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఆత్మీయంగా స్పందించారు.
పవన్ కల్యాణ్ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.గత కొన్ని వారాలుగా, నేను నా చికిత్స నిమిత్తం కేరళంలో ఉన్నానని వారి ఆప్యాయత, దయ, ఆతిధ్యం మరచిపోలేనిదన్నారు. నా బస నాకు స్వస్థతను, శాంతిని మరియు ఎన్నో మరపురాని అనుభవాలను అందించింది. నా చికిత్సను ఎంతో అంకిత భావంతో, వ్యక్తిగత శ్రద్ధతో చేసినందుకు డాక్టర్ సీతారాం ఆయుర్వేదిక్ రిట్రీట్‌లోని వైద్యులకు, యాజమాన్యానికి మరియు సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.

కేరళలో నా బస, త్రిప్రయార్ శ్రీ రామస్వామి, గురువాయూర్ శ్రీ కృష్ణ, మామ్మియూర్ శ్రీ మహాదేవ్ మరియు చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మ ఆలయాలను సందర్శించే పుణ్యఫలాన్ని కూడా నాకు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక వారసత్వం ఉన్న ఈ ప్రాచీన ఆలయాలు, నాకు ప్రగాఢమైన భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక చింతన అందించాయన్నారు.
కేరళంలోని దేవాలయాలు మన ప్రాచీన నాగరిక వారసత్వానికి సజీవ నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇవి తరతరాలుగా పవిత్ర సంప్రదాయాలను, విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మోసుకెళ్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలలో దర్శనం, ఆశీర్వాదాలు పొందే భాగ్యం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.నా బస సమయంలో సహకరించినందుకు కేరళ ప్రభుత్వానికి మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా, కేరళ ప్రజలు చూపిన ఆప్యాయతకు, సద్భావనకు మరియు గొప్ప ఆతిథ్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ఆప్యాయత, ఇక్కడ నేను పొందిన ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక అనుభవాలతో కలిసి నా బస నిజంగా మరపురానిది . కేరళం నుంచి లోతైన కృతజ్ఞతతో, గౌరవంతో వెళ్తున్నాను. ధన్యవాదాలు కేరళం అని పేర్కొన్నారు.
ఈ పోస్టుకు కేరళ సీఎం వీడీ సతీశన్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ గారు, మీ మంచి మాటలకు ధన్యవాదాలని రిప్లై ఇచ్చారు. విశ్రాంతి, కోలుకోవడం కోసం కేరళను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారు. మా ప్రజల ఆతిథ్యం, పురాతన ఆలయాల దర్శనం మీకు శాంతి, ఉపశమనం కలిగించినందుకు సంతోషం. మళ్లీ త్వరలో మిమ్మల్ని ఆహ్వానించాలని ఎదురుచూస్తున్నాం అంటూ పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం, ప్రజల తరఫున పూర్తి కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను అని రాశారు.













Click it and Unblock the Notifications
