డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటన – 20 రోజులు అక్కడే.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన శాఖల పరిధిలో మంత్రిగా చెయ్యాల్సిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే అంతకు ముందు తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లు పూర్తి చేశారు.
కేరళ వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా కేరళకు వెళ్లనున్నారని సమాచారం. ప్రకృతి వైద్యం కోసం 20 రోజుల పాటు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. కేరళలో మంచి ప్రకృతి, ఆయుర్వేద వైద్యం ఉన్న కారణంగా ఆయన అక్కడకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అనారోగ్య సమస్యలతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్‌ను ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఒకేసారి రెండు భుజాలకు శస్త్రచికిత్స చేయడం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని సూచించడంతో గత నెలలో కుడి భుజానికి ముంబైలోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో సర్జరీ చేశారు.
ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లాలని నిర్ణయం
మరో భుజానికి కూడా రెండు నెలల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల మరోసారి తీవ్ర జ్వరం రావడంతో ఆరోగ్యంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లాలని భావిస్తున్నారు. ఆరోగ్యం కోసం ప్రకృతి వైద్యం చేయించుకోవాలని, మళ్ళీ రీ ఎనర్జీతో పని చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం.
పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల నియామక ప్రక్రియ అప్పుడే
ఇదిలా ఉండగా, జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల నియామక ప్రక్రియను ఆయన సమీక్షించారు. 36 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కేలా మరిన్ని మార్పులు చేసి, మరికొద్ది వారాల సమయం తీసుకుని జాబితా ఖరారు చేయాలని నిర్ణయించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications