వైసీపీకి అస్త్రాన్ని అందించిన పవన్?
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సంక్షేమం- అభివృద్ధికి అదిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఆదాయ వనరులను పెంచుకోవడం, సంపదను సృష్టించడానికి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటోంది.
నారా లోకేష్ సహా..
ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్ర కింజరాపు అచ్చెన్నాయుడు సహా అన్ని శాఖల మంత్రులు ఇందులో పాల్గొన్నారు. రోజంతా సాగే సమావేశం ఇది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

24 నుంచి అసెంబ్లీ..
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో- బడ్జెట్ రూపకల్పనపైనా చర్చ ఉంటుంది. మంత్రులు తమ ప్రాధాన్యతల గురించి వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
పవన్ డుమ్మా..?
ఈ కీలక భేటీకి పవన్ కల్యాణ్ దూరం అయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు మంత్రివర్గ సహచరులందరూ దీనికి హాజరైనప్పటికీ.. ఆయన మాత్రమే రాలేదని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం- వైరల్ ఫీవర్‌తో బాధపడుతోండటమేనని అంటున్నారు. అయినప్పటికీ- ఈ కార్యదర్శుల భేటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారని సమాచారం.
వైసీపీ నుంచి విమర్శల దాడి..
పవన్ కల్యాణ్.. ఈ భేటీకి దూరం కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్టయింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన కోసం చంద్రబాబు అదే పనిగా కార్యదర్శుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పవన్ ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నిస్తోన్నాయి.
కీలకమైన శాఖలు..
పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న శాఖల్లో కీలకం- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామాలకు మంచినీటి సరఫరా. వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన చర్యలు, బడ్జెట్ కేటాయింపులు ఎంతో కీలకం. గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు అత్యవసరం కూడా. అలాగే- పర్యావరణం, అడవులు కూడా.
కీలక భేటీకి..
అలాంటి ప్రాధాన్యత ఉన్న శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పవన్ కల్యాణ్.. ఈ భేటీకి హాజరు కాకపోవడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నిస్తోన్నాయి. కూటమిలో లుకలుకలే దీనికి కారణం అంటూ ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లపై భారీగా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications